PV Sindhu Wedding : భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) నూతన వధువుగా మారారు. తమ ఫ్యామిలీ ఫ్రెండ్ వెంకట దత్తసాయితో వివాహమాడి మూడు ముళ్లబంధంలో ప్రవేశించారు. రాజస్థాన్ రాష్ట్ర ఉదయ్‌పూర్‌లోని విలాసవంత రిసార్ట్‌లో వీరి పెళ్లి నిన్న రాత్రి (డిసెంబరు 22) జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను పీవీ సింధు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పీవీ సింధు- వెంకట దత్తసాయి వివాహం సంప్రదాయ, ఆధ్యాత్మిక రీతిలో జరిగింది. పెళ్లి రాజస్థాన్‌లో జరిగినా రిసిప్షన్ మాత్రం హైదరాబాద్‌లోనే జరగనుంది. సింధు స్వస్థలమైన భాగ్యనగరిలో రేపు (డిసెంబరు 24) గ్రాండ్‌గా జరగనుంది.
క్రీడాకారిణి జీవితంలో ఐటీ నిపుణుడు
ఒలింపిక్ పతకాలు రెండు సార్లు గెలుచుకున్న భారతదేశంలోని అత్యంత ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులలో ఒకరైన పీవీ సింధు తన జీవితంలోని కొత్త దశలోకి ప్రవేశించారు. 29 ఏళ్ల సింధు హైదరాబాద్‌కు చెందిన ఐటీ నిపుణుడు వెంకట దత్త సాయితో వివాహం చేసుకున్నారు.
తెలంగాణ బిడ్డ PV Sindhu
పీవీ సింధు (పుసర్ల వెంకట సింధు) భారతదేశ అత్యుత్తమ బ్యాడ్మింటన్ క్రీడాకారిణుల్లో ఒకరు. 1995 జూలై 5న తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించారు. తల్లిదండ్రులైన వెంకట రమణ, విజయలక్ష్మి నుంచి క్రీడా ప్రేరణ పొందారు. తల్లిదండ్రులు ఇద్దరూ వాలీబాల్ క్రీడాకారులు. సింధు మాత్రం బ్యాడ్మింటన్‌ను ఎంచుకున్నారు. ఎనిమిదేళ్ల వయసులో ఆమె క్రీడా ప్రయాణం ప్రారంభమైంది. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో సింధు శిక్షణ పొందారు. తన ప్రతిభ, శ్రమ, క్రమశిక్షణతో క్రీడా ప్రపంచంలో ప్రత్యేకతను చాటుకున్నారు.
వెంకట దత్త సాయి ఎవరంటే..
వెంకట దత్త సాయి (Venkata Datta Sai) 2018లో ఫ్లేమ్ యూనివర్శిటీ నుంచి అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA) పూర్తి చేశారు. అనంతరం బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) నుంచి డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అదనంగా లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో డిప్లొమా కూడా పూర్తి చేశారు.
pv sindhu wedding details : పీవీ సింధు భర్త.. రూ. 150 కోట్ల ఆస్తిపరుడు
హైదరాబాద్‌లోని ప్రముఖ టెక్ సంస్థ, పోసిడెక్స్ టెక్నాలజీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వెంకట దత్త సాయి పని చేస్తూ సుస్థిరమైన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ రంగంలో అంచెలంచెలుగా రాణిస్తున్న ఆయన అత్యంత ఆర్థిక స్థిరత్వాన్ని పొందారు. ఆయన ఆస్తుల విలువ సుమారు రూ. 150 కోట్లు అని తెలుస్తోంది.
క్రీడల పట్ల ఆసక్తి … IPL అనుభవం
వెంకట దత్త సాయి కార్పొరేట్ విజయాలతో పాటు క్రీడలపై అమిత ఆసక్తి కలిగి ఉన్నారు. JSW కంపెనీలో పని చేస్తున్న ఆయన మరోవైపు IPL జట్టు డెల్హీ క్యాపిటల్స్ ఆపరేషన్లను సమర్థంగా నిర్వహించారు. ఈ అనుభవం వల్లల క్రీడ రంగంలో కూడా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.
సొల్యూషన్స్ నిపుణుడు
వెంకట దత్త సాయి ఆర్థిక వ్యవస్థల కోసం కీలకమైన సొల్యూషన్స్‌ను అందించే నిపుణుడిగా పేరొందారు. భారతదేశంలోని పెద్ద బ్యాంకులకు ఆర్థిక ఆపరేషన్లను మెరుగుపరచడంలో అత్యంత నమ్మకమైన వ్యక్తిగా వెంకట దత్త సాయి పేరుగడిస్తున్నారని ఆయన లింక్డిన్ ప్రొఫైల్ చెబుతోంది.
‘నా సొల్యూషన్స్ అండ్ ప్రోడక్ట్స్ దేశంలోని పెద్ద బ్యాంకులైన హెచ్‌డిఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి సంస్థల కీలక ఆపరేషన్లకు ఉపయోగపడుతున్నాయి. క్రీడా రంగంలో పనిచేయడంతో ఆర్థికంగానే కాకుండా సామాజికంగా మంచి గుర్తింపు పొందాను’ ఆయన తన గురించి చెప్పారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..