APGVB Bank Merger : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (APGVB ) తెలంగాణలో ఇక ఎక్కడా కనిపించదు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు (TGB)లో అది కలవనుంది. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. 493 శాఖలు ఉన్న APGVB తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో విలీనం కానుంది. మొత్తం 928 శాఖలతో కొత్త రూపం దాల్చనుంది. ఇది రూ. 70 వేల కోట్ల లావాదేవీలను నిర్వహించనుందని అంచనా.
ఒక రాష్ట్రం.. ఒక గ్రామీణ బ్యాంకులో భాగంగా..
రాష్ట్రాల వారీగా గ్రామీణ బ్యాంకింగ్ సేవలను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఏపీజీవీబీని టీజీబీలోకి విలీనం చేయాలని నిర్ణయించింది.
ఒక రాష్ట్రం.. ఒక గ్రామీణ బ్యాంకు స్ఫర్తితో ఈ ప్రక్రియ చేపట్టింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGB) 2025 జనవరి 1న ఆవిష్కరించనుందని చైర్‌పర్సన్ ఇ.శోభ తెలిపారు. తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (APGVB) శాఖలు TGB లో విలీనం కానున్నాయని వెల్లడించారు. విలీనమైన సంస్థలో APGVB శాఖల ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని ఆమె తెలిపారు.
APGVB : నాలుగు రోజులు సేవలు బంద్
TGBలో విలీనం క్రమంలో డిసెంబరు 28 నుంచి 31 వరకు APGVB బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఆన్‌లైన్ సేవలు, ఏటీఎంలు, ఇతర బ్యాంకింగ్ కార్యకలాపాలకు కూడా అంతరాయం ఏర్పడనుంది. అత్యవసర పరిస్థితుల్లో డిసెంబర్ 30, 31 తేదీల్లో ఖాతాదారులకు రూ. 5 వేల వరకు నగదు డ్రా చేసుకొనేందుకు అవకాశాన్ని కల్పించనున్నారు. విలీనానంతరం అన్ని బ్యాంకింగ్ పత్రాలు, పాస్‌బుక్‌లు, చెక్కులు తదితర డాక్యుమెంట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పేరుతో జారీ చేయనున్నారు.
APGVB విభజన నేపథ్యం..
విలీనం నేపథ్యంలో APGVB ఆస్తులు, బాధ్యతలను రెండు రాష్ట్రాల మధ్య విభజించాలని ఆర్థిక వ్యవహారాల శాఖ (DFS) ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 2024 మార్చి 31 నాటికి ఆడిట్లన్నీ జరిగి పోయాయి.
అక్టోబరులోనే TGB స్థాపన
తెలంగాణ గ్రామీణ బ్యాంకు 2014 అక్టోబరు 20న ఏర్పాటైంది. ఎస్‌బీఐ అఫిలియేటెడ్ బ్యాంకుగా దీన్ని స్థాపించారు. నాలుగు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఇందులో విలీనం చేశారు. 1. శ్రీ సారస్వతి గ్రామీణ బ్యాంక్ (ఆదిలాబాద్), 2. శ్రీ శాతావాహన గ్రామీణ బ్యాంక్ (కరీంనగర్), 3. శ్రీ రామ గ్రామీణ బ్యాంక్ (నిజామాబాద్) 4. గోల్కొండ గ్రామీణ బ్యాంక్ (రంగారెడ్డి)ను టీజీబీలో కలిపారు. 18 జిల్లాల్లో 428 శాఖలతో TGB తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కొత్తగా APGVB 493 శాఖలు TGBలో విలీనం కానున్నాయి. తద్వారా TG మొత్తం శాఖల సంఖ్య 928కి చేరుతుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..