కేరళ హైకోర్టు (Kerala High Court) ఒక సంచలన తీర్పును వెలువరించింది. మహిళ శరీర నిర్మాణంపై వ్యాఖ్య చేయడం కూడా నేరమే అవుతుందని పేర్కొంది. ఇది లైంగిక వేధింపు (Sexual Harassment) కిందికే వస్తుందని తేల్చి చెప్పింది. ఒక కేసులో న్యాయమూర్తి ఎ.బదరుద్దీన్ (Justice A Badaruddin) ఈ తీర్పును వెలువరించారు. తనపై నమోదైన లైంగిక వేధింపు కేసును రద్దు చేయమని కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (KSEB) ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఒక మహిళ శరీర నిర్మాణంపై కామెంట్ చేయడం సెక్స్ ఉద్దేశంతో ముడిపడి ఉంటుందని, ఇది కూడా లైంగిక వేధింపు కిందికే వస్తుందని న్యాయమూర్తి తీర్చు చెప్పారు.
కేసు పూర్వపరాలు
కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో పనిచేసే తన సహోద్యోగి తన శరీర నిర్మాణంపై అసభ్యకరంగా మాట్లాడాడని అదే సంస్థలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి పోలీసుస్టేషన్‌లో గతంలో ఫిర్యాదు చేసింది. తనకు ఈ వేధింపులు 2013 నుంచి ప్రారంభమయ్యాయని పేర్కొంది. క్రమేణా అతడి దుశ్చర్యలు అధికమయ్యాయని తెలిపింది. ఈ నేపథ్యంలో అతడిపై IPC సెక్షన్లు 354A (లైంగిక వేధింపు), 509 (మహిళల మార్యాదను అవమానించడం), అలాగే కేరళ పోలీస్ యాక్ట్ సెక్షన్ 120(o) (అవాంఛనీయ కాల్, లేఖ, సందేశం ద్వారా హింసించడం) కింద కేసు నమోదైంది.
నిందితుడి వాదన ఏమిటంటే..
ఒక వ్యక్తి శరీర నిర్మాణం బాగుందని చెప్పడం సెక్సువల్ కలర్ ఉన్న కామెంట్‌గా పరిగణించలేమని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. దీనిపై ఇన్ని సెక్షన్లలో కేసు నమోదు చేయడం సరికాదని పేర్కొన్నారు.
ప్రాసిక్యూషన్ వాదన
నిందితుడి కాల్స్, మెస్సేజ్‌లు సెక్సువల్ కలర్ ఉన్న కామెంట్లతో కూడికొని ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదించింది. ఆ మహిళ మర్యాదలను భంగం కలిగిస్తూ ఆమెను వేధించడం సెక్సువల్ హరాస్మెంట్ కిందికే వస్తుందని పేర్కొంది.
Kerala High Court న్యాయమూర్తి ఏమన్నారంటే..
ప్రాసిక్యూషన్ వాదనలను Kerala High Court న్యాయమూర్తి సమర్థించారు. ప్రాథమికంగా ఈ కేసులో సెక్షన్లు 354A, 509 కింద నేరాలకు కావాల్సిన అంశాలు బలంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కేరళ పోలీస్ యాక్ట్ సెక్షన్ 120(o) కూడా ఈ కేసులో వర్తిస్తుందన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..