Saif Ali Khan stabbed : ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై హత్యాయత్నం జరిగింది. తీవ్ర కత్తిపోట్లకు గురైన ఆయన ఆస్పత్రి పాలయ్యారు. ముంబై (Mumbai) బాంద్రాలోని ఆయన నివాసం వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన ఓ ఆగంతకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లోకి ఆగంతకుడు చొరబడ్డాడని గుర్తించిన సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఎలాంటి ఆయుధం లేకుండానే అతడికి ఎదురొడ్డారు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో అతడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు.
సైఫ్ అలీ ఖాన్ శరీరంపై లోతైన గాయాలు
కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్‌ను లీలావతి ఆస్పత్రి (Lilavati Hospital in Mumbai)కి తరలించారు. ఆయన శరీరంపై మొత్తం ఆరు గాయాలు ఉన్నాయని ఆస్పత్రి సీఈవో డాక్టర్ నీరజ్ ఉట్టమాని తెలిపారు. సైఫ్ అలీకి అయిన గాయాల్లో రెండు చాలా లోతుగా ఉన్నాయని గుర్తించామని పేర్కొన్నారు. ఒక గాయం వెన్నుపూసకు చాలా దగ్గరగా ఉందన్నారు. సైఫ్ అలీ ఖాన్‌కు న్యూట్రోసర్జన్ డాక్టర్ నితిన్ డాంగే నేతృత్వంలో వైద్య బృందం శస్త్రచికిత్స చేస్తోందని, పూర్తి వివరాలు ఆపరేషన్ తర్వాత తెలియజేస్తామని ఆస్పత్రి సీఈవో తెలిపారు.
ముంబై పోలీసుల నివేదిక
ముంబై పోలీసుల ( Mumbai Police) ప్రకారం.. సైఫ్ ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. పనిమనిషితో అతడు తలపడ్డాడు. ఇది గుర్తించిన సైఫ్ ఎదురొడ్డారు. ఈ క్రమంలో ఆ ఆగంతకుడు ఆయనపై పలుమార్లు కత్తి పోట్లు పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దుండగుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
భద్రతా ముప్పుపై చర్చ
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన నేపథ్యంలో బాలీవుడ్లో ప్రముఖుల భద్రతపై పలు ప్రశ్నలను తలెత్తుతున్నాయి. ఇటీవలే సల్మాన్ ఖాన్ (Salman khan) ఇంటి వద్ద కాల్పుల ఘటన, బాబా సిద్దిఖీ హత్య వంటి సంఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారగా తాజాగా సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కలకలం రేపింది.
Saif Ali Khan కుటుంబం నుంచి ప్రకటన
సైఫ్ కుటుంబం మీడియాకు అధికార ప్రకటన విడుదల చేసింది. సైఫ్ అలీపై కత్తి పోట్లతో హత్యాయత్నం జరిగిందని, ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఈ ఘటనపై ఎలాంటి ఊహాగానాలకు తావివ్వొద్దని విజ్ఞప్తి చేసింది. సైఫ్ అలీ భార్య కరీనా కపూర్ (kareena kapoor) మాట్లాడుతూ అభిమానులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోందని తెలిపారు.
రాజకీయ నాయకుల స్పందనలు
ఈ దాడి ఘటనపై దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన విషయం తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురయ్యానని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శివసేన నేత అనంద్ దూబే మాట్లాడుతూ ముంబైలో సెలబ్రిటీలే సురక్షితంగా లేరంటే, సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్సీపీ నేత సుప్రియా సూలే మాట్లాడుతూ సైఫ్ సురక్షితంగా ఉన్నారని తెలిసిందని, ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లొద్దని కోరుకుందామని అన్నారు.
సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి
సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) పై హత్యాయత్నం జరగడంపై సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పూజా భట్ తీవ్రంగా స్పందిస్తూ మనం చట్టాలను రూపొందించుకున్నాం గానీ, అవి పకడ్బందీగా అమలు కావడం లేదని వ్యాఖ్యానించారు. సైఫ్ అలీ ఖాన్ లాంటి ప్రముఖులపై హత్యాయత్నం ఘటన భద్రతా చర్యల డొల్లతనాన్ని ఎత్తి చూపుతోందదని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) స్పందిస్తూ
సైఫ్ సార్‌పై దాడి గురించి విన్నాక చాలా బాధగా అనిపించింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..