- “అలీ” వ్యూహంతో వసూళ్ల జాతరలో చిందులేస్తున్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు..?
- నిబంధనలకు పాతర.. వసూళ్ల జాతర..
- బరితెగించిన ఎంవీఐ లు… ?చేతులెత్తేసిన ఉన్నతాధికారి ..?
- ఏసీబీ నజర్ వేస్తే తప్ప వసూళ్లు ఆగేలా లేవట..
RTA Corruptions : రండి బాబు.. రండి మాకు కావాల్సింది సమర్పించుకోండి మీ పనులను సులువుగా చేసుకోండి. మా దగ్గర నిబంధనలతో పని ఉండదు అడిగేవారు అసలే లేరు. మీకు లర్నింగ్ లైసెన్స్ కావాలా? పర్మినెంట్ లైసెన్స్ కావాలా? ఇంకేమైనా సేవలు కావాలా మా ప్రైవేట్ అసిస్టెంట్ ని కలవండి ఈజీగా లైసెన్స్ పొందండి అనే రీతిలో హన్మకొండ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు వ్యవహరిస్తున్నారని జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో వసూళ్ల జాతర నడుస్తోందట, ఆ కార్యాలయంలో రవాణా శాఖ నిబంధనలు పాతరేసి వసూళ్ల జాతరలో ఎంవీఐ లు నిమగ్నమయ్యారని విశ్వసనీయంగా తెలుస్తోంది.
RTA Corruptions : లంచం కొట్టు.. లైసెన్స్ పట్టు..?
హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో విచ్చలవిడిగా లైసెన్సులు జారీ చేస్తున్నట్లు సమాచారం.అర్హత ఉన్నా లేకున్నా లంచం ముట్టజెప్పితే చాలు క్షణాల్లో వాహనదారులకు లైసెన్స్ లు జారీ చేస్తున్నారట. లర్నింగ్ లైసెన్స్ పొందాలంటే కంప్యూటర్ పరీక్షలో పాస్ కావాలి.పర్మినెంట్ లైసెన్స్ పొందాలంటే డ్రైవింగ్ టెస్ట్ లో పాస్ కావాలి. కానీ వాహనదారులకు ఎలాంటి టెన్షన్ లేకుండా కార్యాలయంలో దగ్గరుండి వారే పరీక్ష పాస్ చేపిస్తున్నారట. టెస్ట్ ట్రాక్ లేదు కాబట్టి తూతూ మంత్రంగా డ్రైవింగ్ చేపించినట్టు కలరింగ్ ఇస్తూ డ్రైవింగ్ లైసెన్స్ లు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికోసం ఎంవీఐ ల ప్రైవేట్ అసిస్టెంట్ కు ప్రభుత్వ ఫీజు కాకుండా లెర్నింగ్ లైసెన్స్ కు రూ.900, పర్మినెంట్ లైసెన్స్ కు రూ.1500,
హెవీ లైసెన్స్ కు రూ.3300, ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ కు రూ.2100 సమర్పిస్తే చాలని లైసెన్స్ లు పొందడం ఈజీ అని తెలిసింది.ముగ్గురు ఎంవీఐ బరితెగించి వసూళ్లను ప్రోత్సహిస్తుండడంతో చేసేదేంలేక ఉన్నతాధికారి సైతం చేతులెత్తేసినట్లు సమాచారం
ప్రైవేట్ అసిస్టెంట్ వ్యూహం..?
హన్మకొండ ఆర్టీఏ కార్యాలయాన్ని(Hanmkonda RTA Office ) బయటనుండే ఓ ప్రైవేట్ వ్యక్తి పరోక్షంగా శాసిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లకు ప్రైవేట్ అసిస్టెంట్ గా ఉంటూ వాహనదారుల నుండి మామూళ్లను వసూళ్లు చేసి, ఆ మొత్తాన్ని పువ్వుల్లో పెట్టి అధికారులుకు అప్పగించే సదరు ప్రైవేట్ అసిస్టెంట్ ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నారట ఎంవీఐ లు.వాహనదారుల పత్రాలపై ఎలా కోడ్ వేయాలి, ఎక్కడ కూర్చొని వసూళ్లు చేయాలి,వసూళ్లు చేసిన మొత్తాన్ని సార్ లకు ఎలా పంపించాలి అనే వ్యూహాలను రచించడంలో అలీ సిద్దహస్తుడని కార్యాలయంలో ప్రచారం జరుగుతోంది.పైగా ఎస్ బి, ఇంటెలిజెన్స్, ఏసీబీ అధికారుల నుండి మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లను కాపాడే బాధ్యతలు కూడా సదరు ప్రైవేట్ అసిస్టెంట్ కే అప్పగించారని అందుకే ఎంవీఐ లు బరితెగించి వసూళ్లను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం.
ఏసీబీ నజర్ వేసేనా..?
హన్మకొండ కార్యాలయంలో కోడ్ ల రూపంలో జరుగుతున్న అవినీతి పై ఏసీబీ అధికారులు నజర్ వేస్తే తప్ప అవినీతి ఆగదని ఎంవీఐ ల ప్రైవేట్ అసిస్టెంట్ పై నిఘా పెడితే కనుక విస్తుపోయే వసూళ్ల భాగోతం బయటపడే అవకాశం ఉందని కార్యాలయం లోపల బయట ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికైనా హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంపై ఏసీబీ అధికారులు నజర్ వేసి అవినీతి కి పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని పలువురు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..