Telangana BJP : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ పదవిలో కొనసాగుతుండగా ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ (Bharatiya Janata Party) అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ వంటి ప్రముఖ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
BJP : ఇతర పార్టీల్లా కాదు..
బీజేపీలో మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పదవులు కట్టబెట్టే విధానం ఇతర పార్టీలకంటే భిన్నంగా ఉంటుందని కేంద్ర మంత్రి (Union Minister of Coal and Mines) కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జిల్లాల అధ్యక్షుల ఎంపిక జరుగుతోందన్నారు. త్వరలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కూడా పూర్తవుతుందని చెప్పారు. బీఆర్ఎస్ తరహాలో ముందే నిర్ణయాలు తీసుకునే పద్ధతి బీజేపీలో ఉండదని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేసే అధికారం పార్టీ అధిష్ఠానానికి ఉంటుందని, నేతలందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారని వివరించారు.
మహిళలు, బీసీలకు ప్రాధాన్యం
బీజేపీలో ఇప్పటి వరకు 650 మండల అధ్యక్షుల ఎంపిక పూర్తయిందని కిషన్ రెడ్డి తెలిపారు. వీరిలో చాలా మంది మహిళలు ఉన్నారని అన్నారు. అలాగే 33 శాతం బీసీలకు అధ్యక్ష పదవులు కేటాయించినట్లు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఈ నెలాఖరులోగా పూర్తి అవుతుందని అన్నారు.
ఎలాంటి పొత్తు లేకుండానే పోటీ
రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా కిషన్ రెడ్డి స్పందించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి పొత్తులు లేకుండా అన్ని ప్రాంతాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. మెజారిటీ స్థానాలు గెలుస్తామనే నమ్మకం తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.
మా సహకారం తీసుకోని కాంగ్రెస్
రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధి పనులకు డబ్బుల్లేవని, హైదరాబాద్‌లో వీధి దీపాల నిర్వహణకు కూడా నిధులు లేకపోవడం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. కేంద్రం సహకారం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతోందని విమర్శించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
1 Comment
[…] సీటును బిజెపి (BJP) తరపున అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించి […]