- యావత్ తెలంగాణ ప్రజల మదిని తొలుస్తున్న ప్రశ్న?
- కేసిఆర్ బయటికొస్తే పూర్వవైభవం అంటున్న గులాబీ కేడర్
- కాంగ్రెస్ అధికారంలోకి రావడం జీర్ణించుకోలేకపోతున్నారంటున్న కాంగ్రెస్..
- వ్యూహాలు రచిస్తున్నారా… జీర్ణించుకోలేకనే బయటకు రావట్లేదా?
Telangana : తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది.. ఆమరణ దీక్షతో చావు దాకా వెళ్లి.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను సాకారం చేసిన అపర చాణక్యుడు కేసీఆర్ (KCR ) కొంత కాలంగా ఎందుకు కనిపించడం లేదు..? దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో కేసీఆర్ ఏది మాట్లాడినా సంచలనమే, ఆయన మాట్లాడకపోవడమూ ఇప్పుడ సంచలనమే.. ఆయన మౌనమే ఓ భారీ వ్యూహాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం రణరంగాన్ని తలపిస్తుంటే.. ఆయన ఎందుకు మిన్నకుండిపోతున్నారు? తెలంగాణ జాతి పితగా పేరొందిన వ్యక్తి.. ఇప్పుడెందుకిలా మౌనమునిగా మారిపోయారు. బీఆర్‌ఎస్ (BRS Party) అధినేత కేసీఆర్ (KCR) గురించి.. పార్టీ వర్గాల్లోనే కాదు, యావత్ తెలంగాణ ప్రజానీకంలో జరుగుతున్న చర్చ ఇదీ.. ఇంతకీ ఆయన మౌనం దేనికి సంకేతం?
క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వస్తారా? లేదా..? తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ, ఏ నలుగురు కలిసినా ఇదే టాపిక్.. పల్లెలు, పట్టణాలు అంటూ తేడా లేకుండా యావత్ తెలంగాణ ప్రజల మదిని తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే.. కేసీఆర్ ఎక్కడ…? అసలు కేసిఆర్ బయటికి వస్తారా.. వస్తే ఎప్పుడు వస్తారు? నిజంగానే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా..? మరే ఇతర కారణాలైన ఉన్నాయా? అసలు గులాబీ బాస్ మౌనం వెనుక మర్మం ఏమై ఉంటుంది. అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు.
KCR : కేసీఆర్ వస్తే పూర్వవైభవమంటున్న గులాబీ శ్రేణులు
తెలంగాణ కోసమే పార్టీని స్థాపించి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పది సంవత్సరాపాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా ప్రజలకు దూరంగా ఉంటున్నారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధికార పక్షం చేస్తున్న ఆరోపణలు, విమర్శలను ఎప్పటికప్పుడు కేటీఆర్(KTR), హరీష్ రావు తిప్పికొడుతున్నప్పటికీ గులాబీ పార్టీ నేతలు, కార్యకర్తలకు కేసీఆర్ లేని లోటు కనిపిస్తోందట. కేసీఆర్ అజ్ఞాతం వీడి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వస్తే తప్ప గులాబీ పార్టీకి పూర్వవైభవం వచ్చేలా లేదని కార్యకర్తలు లోలోపల మదనపడుతున్నారట. కేసీఆర్ కనుక బయటికి వస్తే గులాబీ పార్టీ పుంజుకోవడంతోపాటు పార్టీకి పూర్వవైభవం వస్తుందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
KCR జీర్ణించుకోవడం లేదా..? వ్యూహాలు రచిస్తున్నారా…?
తెలంగాణలో 10 యేండ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ మరోమారు కూడా తనకు ఎదురే లేదని అనేక సార్లు పరోక్షంగా బహిరంగ సభల్లో వ్యాఖ్యలు సైతం చేశారు. అలాంటి కేసీఆర్ కు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి రూపంలో గట్టి ఎదురుదెబ్బ తలిగినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుండి కేసీఆర్ ఎక్కడా కనిపించిన దాఖలాలు పెద్దగా కనబడటంలేదు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రి కావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నట్లు కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారా? లేక ప్రభుత్వానికి కాస్త సమయమిచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే వ్యూహాలు రచిస్తున్నారా? అనేది ఎవరికీ అంతుచిక్కడంలేదట.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..