US citizenship : అమెరికా (US)లో భారతీయ మహిళలు ముందస్తు ప్రసవాలు (Pre-term deliveries) చేయించుకుంటున్నారు. నెలలు పూర్తిగా నిండక ముందే ఆపరేషన్ల ద్వారా పిల్లలను కనేందుకు ఆస్పత్రుల్లో బారులు తీరుతున్నారు. తల్లీబిడ్డలకు ఇది ఎంత ప్రమాదకరమని తెలిసినా ఈ రిస్కు తీసుకొనేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు.
ముందస్తు ప్రసవాలు ఎందుకంటే..
అమెరికా 47వ అధ్యక్షుడిగా వైట్ హౌస్‌లో అడుగుపెట్టిన తొలి రోజే డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారితో పాటు విద్యార్థులు, టూరిస్టులు, తాత్కాలిక వర్క్ వీసాలు కలిగిన వారికి జన్మించే పిల్లలకు ఇక ఆ దేశ పౌరసత్వం (Birthright US citizenship) లభించదని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ నిబంధన 2025 ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు.
చాలా కాలంగా అమలులో ఉన్న నిబంధనలకు పూర్తిగా భిన్నమైన నిర్ణయాన్ని ట్రంప్ ప్రకటించడం అమెరికాలోని భారతీయుల్లో తీవ్ర కలకలం రేపింది. జన్మతః పౌరసత్వంపై ఆంక్షలు తమకు పుట్టబోయే బిడ్డల జీవితాలపై ప్రభావితం పడుతుందని తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ప్రసవాలు (Pre-term deliveries) చేయించుకొనేందుకు గర్భిణులు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. తమకు పుట్టబోయే పిల్లలకు అమెరికా పౌరసత్వం వర్తించేలా ట్రంప్ విధించిన గడువులోగా పిల్లలను కనేందుకు నెలలు పూర్తిగా నిండకముందే డెలివరీలు చేయించుకుంటున్నారు.
జన్మతః పౌరసత్వం .. కొత్త మార్గదర్శకాలు
ట్రంప్ ప్రవేశపెడుతున్న కొత్త విధానం ప్రకారం ఇకపై తల్లిదండ్రుల్లో కనీసం ఒకరికి అమెరికా పౌరసత్వం లేదా శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) లేదా అమెరికా మిలిటరీ సభ్యత్వం ఉండాలి. వీటిలో ఏదైనా గుర్తింపు ఉంటేనే వారి పిల్లలకు జన్మతః పౌరసత్వం (birthright US citizenship) లభిస్తుంది. విదేశీ వీసాలపై అమెరికాలో తాత్కాలికంగా నివసిస్తున్న లేదా అక్రమంగా మకాం వేసిన తల్లిదండ్రుల పిల్లలకు ఇకపై అమెరికా పౌరసత్వం అందదు. ట్రంప్ ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రొటెక్టింగ్ ది మీనింగ్ అండ్ వ్యాల్యూ ఆఫ్ అమెరికన్ సిటిజెన్‌షిప్ అనే పేరుతో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు. దాని ప్రకారం 2025 ఫిబ్రవరి 20 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
Risk in Pre-term deliveries : ముందస్తు ప్రసవాలతో రిస్కులు
- ముందస్తు ప్రసవాలు శిశువు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు అంటున్నారు.
- తల్లికి నెలలు నిండకుంటే శిశువుల్లో ఊపిరితిత్తుల వికాసం పూర్తికాదని, దీంతో పుట్టిన పిల్లలకు శ్వాసకోశ సమస్య ఏర్పడుతుందని చెబుతున్నారు.
- ముందస్తుగా పుట్టే పిల్లల బరువు తక్కువగా ఉంటారని అంటున్నారు.
- ఈ పిల్లల్లో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు.
- ముందస్తు కాన్పులతో పుట్టే పిల్లలకు జీర్ణాశయం సరిగా అభివృద్ధి చెందదని, ఆహారం అరగక వీరు తీవ్రంగా ఇబ్బంది పడతారని అంటున్నారు. భారతీయుల్లో ఆందోళన
Pre-term deliveries in US : ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు తమ కుటుంబ భవిష్యత్తును మెరుగుపర్చడానికి వలస వెళ్తున్నారు. అమెరికా పౌరసత్వం పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది అని చాలా మందిలో నమ్మకం ఉంది. అమెరికా పౌరసత్వం ఉండటం వల్ల పిల్లలు ఉన్నతమైన విద్య, మంచి ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంటాయి. కుటుంబం ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంటుంది. అమెరికా పాస్‌పోర్ట్ కలిగి ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రయాణ సౌలభ్యం ఉంటుంది. జన్మతః పౌరసత్వంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశవ్యాప్తంగా నిరసనలు కూడా మొదలయ్యాయి. ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ భారతీయులు అక్కడి కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..