Stop Violence Against Women : హైదరాబాద్(Hyderabad) లో వరుస హత్యలు ప్రజలను గడగడలాడిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న ఈ దారుణాలు నగరవాసులలో భయాందోళనన కలిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం భార్యను అత్యంత క్రూరంగా హత్య చేసి, మృతదేహాన్ని కుక్కర్లో ఉడికించిన సంఘటన మరవకముందే మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో మరో మహిళపై జరిగిన దారుణం కలకలం రేపుతోంది.
దిశపై జరిగిన దారుణంలా..
మునీరాబాద్ ఘటన 2019లో కలకలం రేపిన దిశ కేసును గుర్తు చేస్తోంది. ఆ ఘటనలో ఓ వెటర్నరీ డాక్టర్‌ను అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసి నిర్మానుష్య ప్రదేశంలో తగలబెట్టారు. మునీరాబాద్‌లో జరిగిన హత్యలోనూ చాలా విషయాలు దిశ ఘటనకు సారూప్యంగా ఉన్నాయి. ఈ హత్యల నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మహిళలపై వరుస దాడులు, హత్యలు జరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
హత్య ఎందుకు జరిగింది?
మునీరాబాద్ ప్రాంతంలో గల నిర్మానుష్య ప్రదేశంలో ఈ హత్య జరిగింది. పోలీసులు వివాహిత అని భావిస్తున్న మృతురాలిని అత్యంత దారుణంగా హత్య చేసి, ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇలా దోషులు ఎలాంటి ఆధారాలను మిగల్చకుండా ప్లాన్ చేశారు. మృతురాలి చేతులపై రెండు టాటూలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒకటి నరేంద్ర పేరు, మరొకటి శ్రీకాంత్ రోహిత్ పేరు ఉంది. ఈ టాటూలే కేసులో కీలకంగా మారాయి. అయితే.. అవి ఎవరివో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ హత్య ప్లాన్ ప్రకారం జరిగిందా.. లేదా ఏదైనా గొడవ జరిగి క్షణికావేశంలో చేశారా? మృతురాలితో నిందితులకు ఉన్న సంబంధం ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తు చేస్తున్నారు. ఆ మహిళ అక్కడికి ఎందుకెళ్లింది.. హత్యకు ముందు మానసిక లేదా శారీరక వేధింపులు జరిగాయా? గత హత్యలతో ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా? అనే విషయాలను ఆరా తీస్తున్నారు.
చురుగ్గా పోలీసుల దర్యాప్తు
పోలీసులు ఘటనా ప్రాంతంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇంతకుముందు జరిగిన మిస్సింగ్ కేసుల గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఘటనా స్థలంలో మృతురాలికి సంబంధించిన నగలు కూడా స్వాధీనం చేసుకున్నారు. నేరస్థులను పట్టుకోవడం కోసం నిశితంగా పరిశోధనలు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.
Violence Against Women : అప్రమత్తత.. ఆవశ్యత
ప్రజలు, ముఖ్యంగా మహిళలు తమ భద్రత పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళల భద్రతకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సర్వత్రా కోరుతున్నారు. న్యాయం అందే వరకు పోలీసులు తమ పనిని మరింత చురుగ్గా నిర్వర్తించాల్సిన ఆవశ్యకత ఉందంటున్నారు. ఈ తరహా దారుణాల గురించి సామాజిక మాధ్యమాల్లో అవగాహన పెంపొందించాలని అంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    