ISRO New Mission 2025 | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) బుధవారం తన 100వ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV-F15) రాకెట్ ద్వారా NVS-02 నావిగేషన్ శాటిలైట్‌ను ఈ మిషన్ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టింది. భూభాగం, వాయు, సముద్ర నావిగేషన్, ఖచ్చితమైన వ్యవసాయం వంటి అనేక రంగాల్లో ఉపయోగకరంగా ఈ శాటిలైట్ ఉంటుంది. ఇస్రో కొత్త చైర్మన్ వి. నారాయణన్ (ISRO Chairman V Narayanan) నేతృత్వంలో జరిగిన మొదటి ప్రయోగం ఇది. ఆయన జనవరి 16న బాధ్యతలు స్వీకరించారు. 2025లో ఇస్రో నిర్వహించిన తొలి ప్రయోగం కూడా ఇదే.
GSLV-F15 రాకెట్ దూసుకెళ్లింది ఇలా..
GSLV రాకెట్ బుధవారం ఉదయం 6.23 గంటలకు శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి ISRO విజయవంతంగా ప్రయాణం ప్రారంభించింది. 19 నిమిషాల ప్రయాణం తర్వాత, రాకెట్ తన పేలోడ్‌ను జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)లో విజయవంతంగా విడదీసింది. ప్రయోగం విజయవంతంపై ఇస్రో చైర్మన్ నారాయణన్ ఆనందం వ్యక్తం చేశారు. 2025లో ఇస్రో స్పేస్‌పోర్ట్ నుంచి GSLV-F15 రాకెట్ ద్వారా NVS-02 నావిగేషన్ శాటిలైట్‌ను కచ్చితమైన కక్ష్యలో ప్రవేశపెట్టడం విజయవంతంగా జరిగిందని ప్రకటించారు. ఇది మన దేశానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన 100వ ప్రయోగం అన్నారు.
GSLV-F15 ఎలా పని చేస్తుంది?
NVS-02 శాటిలైట్ నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టెలేషన్ (NavIC) సిరీస్‌లో రెండోది. ఇది భారత ఉపఖండం, దాని పరిసర ప్రాంతాలకు కచ్చితమైన స్థానం, వేగం, సమయ సమాచారాన్ని ఇస్తుంది. భూభాగం నుంచి సుమారు 1,500 కిలోమీటర్ల వరకు సేవలను ఇది అందిస్తుంది. NavIC రెండో తరం శాటిలైట్‌లలో ఇదొకటి. NVS-02 శాటిలైట్ భూభాగం, వాయు, సముద్ర నావిగేషన్, కచ్చితమైన వ్యవసాయం, ఫ్లీట్ మేనేజ్‌మెంట్, మొబైల్ పరికరాల్లో స్థాన ఆధారిత సేవలు, శాటిలైట్‌ల కోసం కక్ష్య నిర్ధారణ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ఆధారిత అనువర్తనాలు, అత్యవసర, సమయ సేవల వంటి అనేక రంగాల్లో ఉపయోగకరంగా ఉంటుంది. NavIC సిస్టమ్‌లో NVS-01 నుంచి NVS-05 వరకు ఐదు రెండో తరం శాటిలైట్‌లు ఉన్నాయి. ఇవి NavIC బేస్ లేయర్ కన్స్టెలేషన్‌ను మెరుగుపరచడానికి, సేవల నిరంతరతను నిర్ధారించడానికి రూపొందించబడ్డాయి.
GSLV-F15 రాకెట్ సామర్థ్యం ఎంత?
బెంగళూరులోని యు.ఆర్. రావు శాటిలైట్ సెంటర్‌లో రూపొందించిన NVS-02 శాటిలైట్ సుమారు 2,250 కిలోగ్రాముల బరువు కలిగి ఉంది. ఇది L1, L5, S బ్యాండ్లలో నావిగేషన్ పేలోడ్‌ను కలిగి ఉండి ట్రై-బ్యాండ్ యాంటెన్నాను ఉపయోగిస్తుంది. నావిగేషన్ పేలోడ్‌లో రుబిడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్ (RAFS) అనే అణు గడియారం ఉంది.. ఇది నావిగేషన్ పేలోడ్‌కు స్థిరమైన ఫ్రీక్వెన్సీ సూచనగా పనిచేస్తుంది.
NavIC ప్రధాన్యత ఏమిటి?
NavIC అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది భారతదేశం, దాని పరిసర ప్రాంతాలకు కకచ్చితమైన స్థానం, వేగం, సమయ సమాచారాన్ని అందిస్తుంది. NavIC ప్రధాన సేవా ప్రాంతం భారత భూభాగం, దాని చుట్టూ సుమారు 1,500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఇస్రో 100వ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఇది భారతదేశ సాంకేతిక సామర్థ్యాలు, అంతరిక్ష రంగంలో స్వావలంబనకు ఇదే నిదర్శనం.
ISRO ప్రయోగాలు
ఇస్రో తన ప్రయోగాలను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిర్వహిస్తోంది. ఈ కేంద్రం నుంచి మొదటి కక్ష్య ప్రయోగం 1979 ఆగస్టులో జరిగింది. ఇప్పటి వరకు ఇస్రో 100 ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. ఇస్రో ఈ విజయాలు అంతరిక్ష పరిశోధనలో ఉన్న భారతదేశ ప్రగతికి సూచికగా నిలిచాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..