Nagoba Jatara : తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ (Adilabad district) జిల్లా కేస్లాపూర్ గ్రామంలో జరిగే ఒక మహా గిరిజన ఉత్సవం నాగోబా జాతర. ఇది గోండు తెగలకు సంబంధించిన వేడుక ఇది. ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజు ఎంతో వైభవంగా దీన్ని నిర్వహిస్తారు. తెలంగాణ (Telangana)లో జరిగే గిరిజన ఉత్సవాల్లో సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద ఉత్సవంగా నాగోబా జాతర ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్సవంలో గోండు తెగలకు చెందిన మేస్రం వంశీయులు ప్రధాన భక్తులుగా ఉంటారు.
అత్యంత వైభవంగా కొనసాగుతున్న నాగోబా జాతర
నాగోబా జాతర మంగళవారం (2025 జనవరి 28) అర్ధరాత్రి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 4 వరకు కొనసాగనుంది. ఈ జాతరలో ప్రధాన ఘట్టమైన దర్బార్ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క హాజరుకానున్నారు.
Nagoba Jatara విశేషాలు
ప్రతి ఏడాది జనవరిలో నిర్వహించే ఈ మహా ఉత్సవానికి తెలంగాణతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ చి వేలాదిగా భక్తులు తరలివస్తారు. తమ కోరికలు తీర్చుకోవాలనే ఆకాంక్షతో నాగోబా దేవతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
గోదావరి నదీ జలాలతో అభిషేకం
నాగోబా జాతరలో మేస్రం వంశీయులు చేసే పవిత్ర గోదావరి నదీ జలాల అభిషేకం ప్రధాన ఘట్టం.
హస్తినమడుగు నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన గోదావరి జలాలతో నాగోబా దేవతకు అభిషేకం చేయడం ఆనవాయితీ. ఈ జలాలను తెచ్చేందుకు మేస్రం వంశీయులు 70 కిలోమీటర్లు నడిచి ప్రయాణం చేస్తారు. ఈ యాత్రను పునీతంగా భావించి ప్రతి ఏడాది ఈ వంశీయులు దీనిని పాటిస్తారు.
సంప్రదాయ పూజలు
నాగోబా జాతరలో ప్రధానంగా సంప్రదాయ పూజలు, రీతుల ప్రకారం ప్రత్యేకమైన పద్ధతిలో నిర్వహిస్తారు. గిరిజనుల సంస్కృతికి తగినట్టుగా వీరు తమ వంశీయ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇందులో భాగంగా నాగోబా దేవతకు కొత్త విగ్రహ ప్రతిష్టాపన చేస్తారు. గంగాజలంతో దేవతకు పూజలు నిర్వహిస్తారు. సంప్రదాయ డోలు వాయిద్యాలతో ఆలయానికి ఊరేగింపుగా తరలి వచ్చి నాగోబా దేవతకు అభిషేకం చేస్తారు. ఈ ఏడాది జాతరలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ అలం, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, అనిల్ జాదవ్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఇతర ప్రముఖులు హాజరై నాగోబా దేవతకు మహా పూజలు నిర్వహించారు.
ప్రధాన ఘట్టం .. భేటింగ్ కార్యక్రమం
జాతరలో భాగంగా నిర్వహించే ముఖ్య కార్యక్రమాల్లో భేటింగ్ ఒకటి. ఈ సందర్భంగా కొత్త వధువులను వారి వంశీయ దేవతకు పరిచయం చేస్తారు. కొత్తగా పెళ్లయిన వధువులు తొలిసారి ఈ జాతరలో తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతారు.
భద్రతా ఏర్పాట్లు
జాతర (Nagoba Jatara ) సమయంలో భద్రతను పక్కాగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఈ సంవత్సరం సుమారు 600 మంది పోలీసు సిబ్బందిని మోహరించి భద్రతను పెంపొందించారు. జాతర ప్రాంగణంలో 100 సీసీటీవీ కెమెరాలు అమర్చడం ద్వారా భద్రతా పర్యవేక్షణను కట్టుదిట్టం చేశారు. భక్తుల కోసం తాగునీరు, వైద్యం, ఇతర సౌకర్యాలను కూడా అధికారులు అందుబాటులోకి తెచ్చారు.
గిరిజన సంప్రదాయాల ప్రదర్శన
నాగోబా జాతరలో తమ సంస్కృతీ సంప్రదాయాలను గిరిజనులు ప్రదర్శించారు. కళాకారులు సంప్రదాయ నృత్యాలు, పాటలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమాలకు స్థానికులే కాకుండా పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..