Vehicle Kills Leopard : నీళ్ల కోసం రోడ్డుపై వచ్చిన ఓ చిరుత ప్రాణాలు కోల్పోయింది. వేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా (Medak district) రామాయంపేటలో నిన్న రాత్రి (గురువారం) చోటుచేసుకుంది. నేషనల్ హైవే- 44 (National Highway 44) దాటుతున్న ఆడ చిరుత రోడ్డు ప్రమాదానికి బలైంది.
చెక్ డ్యామ్ వద్దకు బయల్దేరి..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిరుత (Leopard) వయసు 6-7 సంవత్సాలు ఉంటుందని మెదక్ జిల్లా అటవీ శాఖ అధికారి ఎం.జోజి తెలిపారు. ఇది మృతి చెందే సమయంలో ఆరోగ్యంగానే ఉందని పేర్కొన్నారు. గతంలోనూ ఈ చిరుతను సమీపంలోని అటవీ ప్రాంతం, చెక్ డ్యామ్ వద్ద కనుగొన్నట్టు చెప్పారు. వన్యప్రాణులకు తాగునీటి కోసం ఈ చెక్ డ్యామ్‌ను ఏర్పాటు చేయగా అక్కడికి అవి వస్తూ పోతాయని తెలిపారు. ఈ చిరుత కూడా నీళ్లు తాగేందుకు వచ్చే క్రమంలో మృత్యువాత పడిందని తెలుస్తోందని అన్నారు.

ప్రమాదం ఎలా జరిగింది?
ఈ చిరుత రోడ్డును దాటే ప్రయత్నంలో మొదట రహదారి ఒక వైపును విజయవంతంగానే దాటింది. మధ్యలో ఉన్న డివైడర్‌ను దాటి రహదారి మరొక వైపు వెళ్లే క్రమంలో వేగంగా వస్తున్న వాహనం దీనిని ఢీకొట్టింది. వాహనం అధిక వేగంగా దూసుకెళ్లడం వల్లే ఈ చిరుత మృతికి కారణమని ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. సమీపంలోని అటవీ ప్రాంతం ఆవాసం కావడంతో రాత్రివేళల్లో వన్యప్రాణులు నీటి కోసం రోడ్డు దాటి వెళ్తూ ప్రమాదానికి గురవుతున్నాయని చెప్పారు.
హైవేలలో వన్యప్రాణులకు ముప్పు
భారతదేశంలో అనేక అటవీ ప్రాంతాలను కలుపుతూ నిర్మితమైన నేషనల్ హైవేలు వన్యప్రాణులకు పెనుముప్పుగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నేషనల్ హైవే 44 వంటి ప్రధాన రహదారులపై తరచుగా వాహనదారులు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల అడవి జంతువుల ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇలాంటి ఘటనలు మన దేశంలోని అనేక ప్రాంతాల్లో గతంలోనూ చోటు చేసుకున్నాయి. మున్ముందు జరగకుండా అటవీ శాఖ, రోడ్డు రవాణా శాఖ సంయుక్తంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సర్వత్రా కోరుతున్నారు.
చిరుతల ప్రాధాన్యత.. వాటి ఆవాసం
చిరుత పులులు (Leopard) భారతదేశ అటవీ ప్రాంతాల్లో ముఖ్యమైన మాంసాహార జీవులు. ఇవి సహజంగా కొండ ప్రాంతాలు, అటవీ భూములు, నీటి వనరులు ఉన్న ప్రదేశాల్లో నివసిస్తాయి. ఇవి ప్రధానంగా అడవి జంతువులను వేటాడి జీవిస్తాయి. అయితే.. మానవ జనాభా పెరిగిపోవడంతో అడవులు తగ్గిపోతున్నాయి. హైవేలు, పట్టణాల విస్తీకరణ వల్ల చిరుతల సహజ ఆవాసాలు నిర్వీర్యమవుతున్నాయి.
వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏం చేయాలి?
ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవాలని అంటున్నారు జంతు ప్రేమికులు. వన్యప్రాణులు (Wild Animals) రోడ్డును సురక్షితంగా దాటేందుకు అండర్ పాస్ లేదా ఓవర్ పాస్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ తరహా నిర్మాణాలు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అమల్లో ఉన్నా ఎన్‌హెచ్-44 లాంటి మరికొన్ని రహదారుల వద్ద ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరమని అంటున్నారు. అలాగే అడవి జంతువులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని కోరుతున్నారు. ఇలాంటి రహదారుల్లో Wildlife Crossing Zone వంటి సూచికలను కూడా ఏర్పాటు చేయాలంటున్నారు. వన్యప్రాణులు అడవి నుంచి రహదారిపైకి రాకుండా పటిష్టమైన కంచెలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే హైవే వెంట ప్రయాణించే వాహనదారులకు వన్యప్రాణుల రక్షణ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.
Leopard మృతితో ఫారెస్టు అధికారుల్లో కదలిక
మెదక్ జిల్లాలో చిరుత మృతి చెందిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులు సమాలోచన చేస్తున్నారు. నేషనల్ హైవే -44 లో అడవి జంతువులు రక్షితంగా దాటేందుకు తగిన మార్గాలను అన్వేషిస్తున్నారు. అండర్‌పాస్‌లు, ఓవర్‌పాస్‌లు, స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు వంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..