Nirmal Forest | తెలంగాణలోని నిర్మల్ (Nirmal) జిల్లాలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ (Kawal Tiger Reserve)లోని ఉదుంపూర్ ఫారెస్ట్ రేంజ్‌లోని మైసంపేట్ సెక్షన్‌లో అడవి కాలిపోయింది. కారుచిచ్చు చెలరేగి ఉవ్వెత్తున మంటలు సంభవించాయి. దీంతో భారీగా వృక్ష సంపద నాశనమైంది. ఈ ప్రమాదంలో అనేక వన్యప్రాణులు (wildlife) కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. దీంతో ఫారెస్టు అధికారులు, పర్యావరణ ప్రేమికులు, జంతు సంరక్షకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అగ్నిప్రమాదానికి కారణాలు ఏమిటి?
ఈ అగ్ని ప్రమాదానికి పశువుల కాపరులు, ఆక్రమణదారులే ప్రధాన కారణమని ఫారెస్టు అధికారులు (Forest officials) అనుమానిస్తున్నారు. కొందరు కాపరులు తమ పశువులను మేత కోసం అడవుల్లోకి తీసుకువెళ్లినప్పుడు బీడీ, చుట్టా తాగి పడేయడం వల్ల పొడిగా ఆకులు, చిన్న చిన్న మొక్కలకు నిప్పు అంటుకొని ఈ ప్రమాదం జరగొచ్చని అంటున్నారు. అలాగే కొందరు అడవిని స్వాధీనం చేసుకొని, దాన్ని వ్యవసాయ భూమిగా మార్చేందుకు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టడం వల్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయని తెలిపారు.
వన్యప్రాణులకు ప్రాణనష్టం
ఉదంపూర్ అడవి అంతటా మంటలు వ్యాపించడంతో జీవజాలం తీవ్రంగా నష్టపోయింది. చిన్నపాటి జంతువులు అగ్నిలో కాలిపోయాయని తెలుస్తోంది. చెట్లు, మొక్కలు దగ్ధం కావడంతో పక్షులు, జంతువులకు జీవనాధారం లేకుండా పోయింది. అలాగే పులుల ఆవాసానికి విఘాతం కలిగిందని తెలుస్తోంది.
Nirmal : టైగర్ రిజర్వ్‌గా కవ్వాల్
కవ్వాల్ టైగర్ రిజర్వ్ కొంతకాలంగా పులులను ఆకర్షిస్తోంది. ఈ అటవీ రిజర్వ్ (reserve)లో పులులు తిరిగి స్థిరపడుతున్నాయి. అలాంటి సమయంలో అగ్నిప్రమాదం జరగడం ఆందోళన కలిగించే విషయమని జంతు ప్రేమికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు తక్షణమే స్పందించకపోతే పులుల ఉనికి మళ్లీ ప్రశ్నార్థకంగా మారొచ్చని అంటున్నారు.
అటవీ శాఖ చర్యలు
అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫారెస్టు అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో ప్రారంభమైన మంటలను అర్ధరాత్రి వరకు నిర్వీర్యం చేశారు. భారీగా సిబ్బందిని రంగంలోకి దింపి ప్రత్యేక యంత్రాల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అలాగే ఈ అగ్ని ప్రమాదానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు నిఘా పెంచారు. అడవిని దహనం చేసే వ్యక్తులను గుర్తించేందుకు డ్రోన్ల సహాయంతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..