- రెవెన్యూ శాఖలో హాట్ టాపిక్ గా ఆయన తీరు..
- గత తహశీల్దార్ రిజెక్ట్ చేసిన భూమికి(ఫైలు ను) పాస్ బుక్ జారీ చేసిన ఘనుడు
- క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే నాలా సర్టిఫికేట్ ల జారీ
- గజాల వారీగా నాలా కన్వర్షన్ లు చేస్తూ రియల్టర్ లకు సహకారం
Revenue Department | గత తహశీల్దార్ రిజెక్ట్ చేసిన ఫైల్ ను ఆ మండలానికి వచ్చిన మరో తహశీల్దార్ (Tahsildar) అప్రూవ్ చేయడంతో సదరు తహశీల్దార్ వ్యవహారం ఇప్పుడు రెవెన్యూ శాఖతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందట.ఆ ఫైలు ను అప్రూవ్ చేయడం వెనుక పెద్దమొత్తంలో ముడుపులు సైతం చేతులు మారినట్లు మండలంలో ప్రచారం జరగడం గమనార్హం.సదరు తహశీల్దార్ ధరణి(Dharani)లోని చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకుని రియల్టర్ లకు సహకరిస్తూ అందినకాడికి దండుకున్నట్లు ఆరోపణలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.అంతేకాకుండా తన మండల పరిధిలో అనుమతి లేకుండా వెంచర్ లు చేసే రియల్టర్ లకు తన సాయశక్తులా సహకరిస్తూ “చల్లా(challa)” స్టైలే అలగని తన రూటే సప”రేటు” అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.కాగా కొన్ని నెలల క్రితం తన పరిధిలోని ఓ గ్రామంలో అంగడిగా పిలువబడే భూమిలోని 8 గుంటల భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే నాలా కన్వర్షన్ (Nala conversion) చేయడం తో గ్రామస్తులు సదరు తహశీల్దార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు విధాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.
ఓ తహశీల్దార్ రిజెక్ట్ ?మరో తహశీల్దార్ అప్రూవ్…
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలోని ఓ భూమికి ప్రస్తుత తహశీల్దార్ పాస్ బుక్ జారీ చేయడం ఇప్పుడు మండలంలో చర్చనీయాంశంగా మారినట్లు తెలిసింది. గుసగుసలు.ప్రస్తుత తహశీల్దార్ కంటే ముందు మండల తహశీల్దార్ గా విధులు నిర్వహించిన అధికారి క్షేత్రస్థాయిలో ఆ భూమిని పరిశీలించి పొజిషన్ లో వేరే వ్యక్తి ఉండడంతో ఆ ఫైలును రిజెక్ట్ చేయగా అసెంబ్లీ ఎన్నికల ముందు బదిలీపై హసన్ పర్తి కి వచ్చిన తహశీల్దార్ అదే భూమికి పాస్ బుక్ జారీచేయటం గమనార్హం. ఓ తహశీల్దార్ కు రైట్ అనిపించని ఫైలు(భూమి) ప్రస్తుత తహశీల్దార్ కు ఎలా రైట్ అనిపించిందోనని పలువురు పలురకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే సదరు భూమికి పాస్ బుక్ జారీకావడం వెనుక అధికార పార్టీకి చెందిన నాయకుల హస్తంతోపాటు ,వారు అందించిన తాయిలాలు గట్టిగానే పనిచేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
రియల్టర్ లకు అనుకూలం..?
హసన్ పర్తి మండల పరిధిలోని నాన్ లేఅవుట్ చేసే రియల్టర్ లకు సహకరిస్తూ వారితో ఓ లెక్క కుదుర్చుకున్నట్లు సదరు తహశీల్దార్ పై ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. తన పరిధిలో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ వెంచర్ లు చేస్తున్న రియల్టర్ కు అనుకూలంగా ప్లాట్ల వారిగా నాలా కన్వర్షన్ చేస్తూ అక్రమ వెంచర్ లను ప్రోత్సహిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.ఆ వెంచర్ లకు అనుమతి లేదని తెలిసినప్పటికీ అందులోని ప్లాట్లను గజాల వారిగా కన్వర్షన్ చేస్తూ తన రూటే సప”రేటు”అని చెప్పకనే చెప్పుకుంటున్నట్లు జిల్లాలో ప్రచారం లేకపోలేదు.
Revenue Department : అంగడి భూమిపై రగడ..
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం(Hasnparthi Mandal)లోని ఎల్లాపూర్ (Ellapur) గ్రామ అంగడిగా చెప్పుకునే భూమిని తహశీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే నాలా కన్వర్షన్ చేయడం ఆ గ్రామంలో చర్చనీయాంశం అయినట్లు తెలుస్తోంది. అంగడి భూమిని రెవెన్యూ అధికారులు(Revenue Department ) అక్రమంగా నాలా కన్వర్షన్ చేశారని ఆ గ్రామంలోని ప్రజలు ఇప్పటికే అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు, స్థానిక ఆర్డీవో కు, కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎలాంటి పరిశీలన చేయకుండా 8 గుంటల భూమిని నాలా కన్వర్షన్ చేయడం వెనుక మతలబేంటోనని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..