National Turmeric Board Nizamabad | నిజామాబాద్ జిల్లా వాసుల నాలుగు దశాబ్దాల కల నేటితో నెరవేరింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం నిజామాబాద్‌లో పసుపు బోర్డు (Turmeric Board ) జాతీయ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కిసాన్ సమ్మేళన్ సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. ” జాతీయ పసుపు బోర్డు ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతులకు పెద్ద బహుమతిని ప్రధాని మోదీ అందించారని తెలిపారు. టెర్మరిక్ బోర్డు ద్వారా ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని, నిజామాబాద్ పసుపుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు.
పురాతన కాలం నుంచి భారత జీవనవిధానంలో పసుపు భాగమైందని, ఇది యాంటీ సెప్టిక్, యాంటీవైరల్ గుణాలు కలిగి ఉందని అమిత్ షా గుర్తుచేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దేశంలో పసుపు ఉత్పత్తిలో ముందంజలో ఉందని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటుకు ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind kumar) నిబద్ధతను ప్రశంసించారు. “అర్వింద్ పట్టుదల వల్లే ఈ బోర్డు నిజం అయ్యింది,” అని అన్నారు. అనంతరం పసుపు రైతులతో అమిత్ షా ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఉగ్రవాదంపై ఏమన్నారంటే.. ?
అయితే ఇదే సభలో కాశ్మీర్ ఉగ్రదాడిపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ బెదిరింపులకు భయపడదని స్పష్టం చేశారు. భారత సైన్యం ప్రత్యక్షంగా శత్రు భూభాగంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను మట్టుబెట్టిందని గుర్తుచేశారు. .
నక్సలిజంపై కూడా అమిత్ షా గట్టిగానే స్పందించారు. “మావోయిస్టులు శాంతికి అడ్డుగా మారుతున్నారు. ఆయుధాలు వదిలివేసి హత్యాకాండను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. లేకపోతే అంతే,” అని హెచ్చరించారు. ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకుంటున్న నక్సలైట్లను 2026 లోపు తుదముట్టిస్తామని మరోసారి స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.