రాష్ట్రంలో నిరుపేద లందరికీ తెల్ల రేషన్ కార్డులు (White Ration Cards) మంజూరు చేయనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెల్ల రేషన్ కార్డుల పంపిణీని సూర్యపేట (Suryapet) జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి (Tirumalagiri)లో ఈనెల 14 న ముఖ్యమంత్రి .రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ సహచరులు హాజరుకానున్న తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అలాగే తిరుమలగిరిలో కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు.
Ration Cards : రేషన్ కార్డులతో 84% మందికి లబ్ధి
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన తెల్ల రేషన్ కార్డుల పంపిణీ తో రాష్ట్ర జనాభాలో 84% మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందన్నారు. అంతకు ముందు ఉగాది పర్వదినం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అయిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్నగర్ నుండి కావడం తనకు గొప్ప అనుభూతిని మిగిల్చిందన్నారు.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెల్ల రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియలో అప్పటికే ఉన్న తెల్ల రేషన్ కార్డులలో వారి వారి కుటుంబ సభ్యులను చేర్చడంతో ఆ సంఖ్య ఇంచుమించు 3 కోట్ల 10 లక్షలకు చేరిందన్నారు. వానాకాలం,యాసంగి పంటలతో ముందెన్నడూ లేని రీతిలో 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కావడం రికార్డ్ సృష్టించిందన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.