– రెండోదశలో 476 పార్టీలను గుర్తించిన ఈసీ
న్యూదిల్లీ : చట్టబద్ధత, నిబంధనలు పాటించని రాజకీయ పార్టీలపై ఈసీ (ECI) కఠిన చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా మరో 476 పార్టీలను రద్దు చేసే దిశగా చర్యలను మొదలు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇటీవల 334 పార్టీలను రద్దు చేసిన ఈసీఐ.. తాజాగా రెండో రౌండ్‌లో మరో 476 పార్టీలను గుర్తించి.. వాటిపై వేటు వేసేందుకు ప్రక్రియను మొదలుపెట్టింది.
ఈసీ గుర్తించిన పార్టీల జాబితాలో ఏపీ నుంచి 17 పార్టీలు ఉండగా.. తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల వ్యవస్థను పటిష్టం చేసేందుకు చేపట్టిన సమగ్రమైన వ్యూహాల్లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 2019 నుంచి ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని రాజకీయ పార్టీలను గుర్తించి, జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఇందులో భాగంగానే తొలి రౌండ్‌లో ఆగస్టు 9న 334 పార్టీలను జాబితా నుంచి తొలగించగా, రెండో దశలో మరో 476 పార్టీలను గుర్తించినట్లు పేర్కొంది. తాము డీలిస్ట్ చేసిన పార్టీలేవీ ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29సీ, 29బి ఆదాయ పన్ను చట్టం-1961, ఎన్నికల గుర్తులు ఆర్డర్ 1968 కింద ఉన్న ప్రయోజనాలను పొందలేవని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    