BRS vs Congress : భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు (KTR) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress govt)పై ఫైర్ అయ్యారు. తెలంగాణలోని ముఖ్యమైన నీటి పారుదల ప్రాజెక్టుల భద్రత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. ముఖ్యంగా జూరాల, మంజీరా, సింగూర్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రమాద హెచ్చరికలు (danger warnings) వెలువడినా వాటిని పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మాత్రమే రాజకీయం
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project)లోని మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు దెబ్బతిన్నాయనే కారణంగా కాంగ్రెస్, బీజేపీలు నిరంతరం విమర్శలు చేస్తున్నాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. అదే సమయంలో ఇతర ప్రాజెక్టులలో కూడా మరమ్మతులు అవసరమయ్యే పరిస్థితి ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. “ప్రతి ప్రాజెక్ట్‌కూ కాలానుగుణంగా మరమ్మతులు అవసరం అవుతాయి. ఇది సాధారణ ప్రక్రియ. కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం అనవసరంగా ప్రతికూల వాతావరణం సృష్టించడం సరికాదు” అని హితవు పలికారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇప్పటికే జూరాల, మంజీరా, సింగూర్ ప్రాజెక్టులపై హెచ్చరికలు జారీ చేసిందని కేటీఆర్ తెలిపారు. “ఈ హెచ్చరికల తర్వాత కూడా మరమ్మతులు చేయకుండా ప్రభుత్వం ఎలా ఈ ప్రాజెక్టుల భద్రతను కాపాడుతుంది?” అని ప్రశ్నించారు. మేడిగడ్డలోని రెండు పిల్లర్ల సమస్యను పట్టించుకున్నట్లే ఈ ప్రాజెక్టుల భద్రతా సమస్యలను కూడా సీరియస్‌గా చూడాలి కదా అన్నారు.
BRS vs Congress : రాజకీయ ప్రయోజనాల కోసం బలిచేయొద్దు
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టులను బలిచేయడం సరికాదని కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించే విషయంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP)లు ఏకమయ్యాయని, ఇతర ప్రాజెక్టుల మరమ్మతుల విషయంలో మాట్లాడటం లేదని అన్నారు. ఇది ద్వంద్వ వైఖరి (double standards)కి నిదర్శనమని దుయ్యయబట్టారు. ఒక ప్రాజెక్ట్ మరమ్మతులు చేయడం అనేది సహజమని, కానీ దానిని రాజకీయంగా వాడుకోవడం ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని ప్రతి నీటి పారుదల ప్రాజెక్ట్, తాగునీటి ప్రాజెక్ట్‌కూ భద్రత అత్యవసరమని, నాలుగు కోట్ల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరమ్మతులు తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








