Hyderabad News | కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ రామంతాపూర్‌లో (Ramanthapur) అర్ధరాత్రి శ్రీకృష్ణాష్టమి (Sri Krishnashtami ) వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు (Electric Shock) తగిలి ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే.. కృష్ణాష్టమి సందర్భంగా రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో ఆదివారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో రథాన్ని లాగుతున్న వాహనం ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో యువకులు వాహనాన్ని నిలిపివేసి చేతులతో లాగుతూ ముందుకు కదిలించారు. ఈ క్రమంలోనే విద్యుత్ తీగలు తగలడంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి కరెంట్ షాక్ కొట్టింది. దీంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లుగా దూరంగా పడిపోయారు. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కొందరు సీపీఆర్ చేసేందుకు యత్నించినా ప్రాణాలు నిలవలేదు.
మరో నలుగురిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.మృతిచెందిన వారిని కృష్ణయాదవ్ (21), సురేశ్ యాదవ్(34), శ్రీకాంత్‌రెడ్డి (35), రుద్రవికాస్ (39), రాజేంద్రరెడ్డి (45)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గన్‌మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








