లోక్‌సభ (Lok Sabha) లో బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ: పాలనలో జవాబుదారీతనాన్ని పెంచే దిశగా కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తీవ్రమైన నేరారోపణలపై అరెస్టు అయిన లేదా జైలుకు వెళ్లిన ఏ ప్రధానమంత్రి (PM) అయినా, కేంద్ర మంత్రి లేదా సహాయ మంత్రి (MoS) ను పదవి నుంచి తొలగించేందుకు లోక్‌సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
30 రోజులు పాటు జైలుకెళితే.. వెంటనే తొలగింపు
కనీసం ఐదేళ్లు జైలు శిక్ష విధించదగిన నేరాలలకు పాల్పడి అరెస్టు అయి వరుసగా 30 రోజులు నిర్బంధించబడిన ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రి అయినా 31వ రోజున తమ పదవులను కోల్పోనున్నారు. దీని ద్వారా ఉన్నత స్థాయి ప్రభుత్వ పాలకులను జవాబుదారీగా ఉంచేలా ఈ బిల్లు రూపొందించబడింది. అయితే, చట్టపరమైన ప్రక్రియకు లోబడి, అటువంటి అధికారులు కస్టడీ నుంచి విడుదలైన తర్వాత వారిని తిరిగి వారి పదవుల్లో చేర్చుకోవచ్చని కూడా బిల్లు స్పష్టం చేస్తుంది.
అవినీతి, ఉగ్రవాదం లేదా హింసాత్మక నేరాలు వంటి తీవ్రమైన నేర కార్యకలాపాలకు సంబంధించి చట్టపరమైన పరిశీలన ఎదుర్కొంటున్న నాయకులు దర్యాప్తులో ఉన్నప్పుడు పదవుల్లో కొనసాగకుండా చూసుకోవడమే ఈ చర్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ నిబంధన చట్టం పరిధిలోకి వచ్చే కేంద్ర, రాష్ట్ర నాయకులకు వర్తిస్తుంది.
పారదర్శకత, జవాబుదారీతనం లక్ష్యంగా..
దేశ రాజకీయ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచే దిశగా ఈ ప్రతిపాదిత చట్టం తీసుకువస్తున్నారు. తీవ్రమైన క్రిమినల్ నేరాలకు పాల్పడిన ఉన్నతస్థాయి పాలకులపై త్వరితంగా, సమర్థవంతంగా చర్యలు తీసుకునే అధికారం శాసనసభకు ఈ బిల్లు కల్పిస్తుందని, దర్యాప్తు జరుగుతున్నప్పుడు అవాంతరాలను నివారిస్తుందని అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    