Hyderabad Murder Case : హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. ఓ మహిళ ప్రియుడి మోజులో పడి కలిసి కట్టుకున్న భర్తనే అంతమొందించింది. పైగా నిద్రలో చనిపోయాడంటూ స్థానికులను, పోలీసులను నమ్మించేందుకు యత్నించింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
నాగర్ కర్నూల్ (NagarKarnool) జిల్లా ఊర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన జల్లెల శేఖర్ (40)కు రంగారెడ్డి (Rangareddy ) జిల్లా వెల్దండ మండలం కుప్పగుండ్లకు చెందిన చిట్టి (33)తో 2009లో వివాహమైంది. వీరికి 14 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. శేఖర్ కుటుంబం ఉపాధి కోసం హైదరాబాద్ (Hyderabad) సరూర్ నగర్ (SaroorNagar) లోని కోదండరామనగర్‌కు వలస వచ్చింది. శేఖర్ కారు డ్రైవర్ గా పనిచేస్తుండగా.. చిట్టి బట్టల షాపులో పనిచేస్తోంది.
వారి సంసారం సజావుగా సాగుతున్న తరుణంలో చిట్టికి స్థానికంగా ఉండే హరీశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో చిట్టి తరచూ నగలు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తోండడంతో ఆమెపై భర్త శేఖర్ కు అనుమానం కలిగింది. దీంతో నగలు, వస్తువులపై ఆరా తీసి చిట్టిని మందలించాడు. దీంతో వారి మధ్య కొద్దిరోజులుగా గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఎలాగైనా భర్తను హత్యచేయాలని నిర్ణయించుకుంది. ప్రియుడు హరీశ్ తో కలిసి అందుకు ప్లాన్ వేసింది.
ఈ క్రమంలో చిట్టి తన కొడుకును స్థానికంగా ఉండే వినాయక విగ్రహం వద్ద స్నేహితులతో కలిసి నిద్ర చేయాలని పంపించింది. అర్ధరాత్రి తరువాత భర్త శేఖర్ నిద్రపోతున్న సమయంలో ప్రియుడు హరీశ్ ను ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. ఇద్దరూ కలిసి నిద్రపోతున్న శేఖర్ గొంతునులిమి హత్య (Wife and Lover Kill Husband) చేశారు. ఆ తరువాత డంబెల్ తో అతడి తలపై దాడి చేశారు. ఈ ఘటన తరువాత హరీశ్ అక్కడి నుంచి పరారయ్యాడు.
మరుసటి రోజు ఉదయం చిట్టి డయల్ 100కు ఫోన్ చేసి.. తన భర్త రాత్రి ఎవరితోనో గొడవపడి వచ్చి నిద్రపోయాడని, ఉదయం చూస్తే చనిపోయి ఉన్నాడని చెప్పింది. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరీక్షించారు. చిట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు విచారణ మొదలుపెట్టగా.. చిట్టి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో చిట్టి అన్ని వివరాలను బయటపెట్టింది. తన ప్రియుడు హరీశ్ తో కలిసి తన భర్త శేఖర్ ను హత్య చేసినట్లు అంగీకరించింది.దీంతో పోలీసులు చిట్టితోపాటు ఆమె ప్రియుడు హరీశ్ ను అరెస్టు చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








