- గన్ పార్క్ వద్ద భారత రాష్ట్ర సమితి ధర్నా
- సచివాలయం ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణుల యత్నం..
Fertilizer Crisis in Telanganan | రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపైన భారత రాష్ట్ర సమితి (BRS Party) శనివారం నిరసన ప్రదర్శన చేపట్టింది. యూరియా కొరత తీర్చాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. సచివాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భం బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్నారు. అంతకు మించి నిర్వహించినా మేము సిద్ధమేనని, రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా, అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని ఏ అంశం పైననైనా సభలో చర్చకు పెడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వ్యవసాయ విస్తీర్ణంతో పాటు వ్యవసాయ సంక్షేమానికి కేసీఆర్ చేసిన కార్యక్రమాలు, పథకాల గురించి వివరిస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం గురించి కూడా సమాధానం చెబుతాం. అసమ్మతి ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. ఇప్పటికే అసమ్మతి ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది, ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు శాసనసభను తమకు అనుకూలంగా ఉండేలా నడిపించే ప్రయత్నం చేస్తోంది.
రైతుల సమస్యలపై ఎందుకు మాట్లాడరు?
రైతుల సమస్యల(Farmers Issues) పైన, రాష్ట్రంలో ఉన్న ఎరువుల సంక్షోభంపైన కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని కేటీఆర్ నిలదీశారు. . 10 సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇలాంటి ఎరువుల కొరత (Fertilizer Crisis) రాలేదు. రైతులు లైన్లలో నిలబడాల్సిన దుస్థితి రాలేదు. మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెప్పులను లైన్లో పెట్టడం, ఆధార్ కార్డులను లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది? పండుగ రోజు కూడా రైతులు ఎరువుల కోసం లైన్లలో నిలబడి, వర్షంలో తడిసి ఇబ్బందులు పడే పరిస్థితి ఎందుకు వచ్చింది? పంట నష్టపోయిన రైతుల గురించి కానీ, భారీ వర్షాల వల్ల ఇబ్బందుల గురించి గానీ సుదీర్ఘంగా చర్చించే అవకాశం అసెంబ్లీలో ఇవ్వండి. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ సంక్షోభం పైన అసెంబ్లీలో చర్చ పెట్టాలి. 600కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 75 లక్షల మంది రైతులు అవస్థల్లో ఉన్నారు. రైతులకు కాంగ్రెస్ చేసిన మోసం పైన అసెంబ్లీలో చర్చ జరగాలి. ఆరు గ్యారెంటీల నుంచి 420 హామీల అమలు వైఫల్యాల దాకా అన్ని అంశాల పైన చర్చిద్దాం. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండే ఒకటి రెండు అంశాల పైననే మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. ప్రజల కష్టాలు, సమస్యల పైన చర్చలకు అసెంబ్లీ వేదిక కావాలి. కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగాలి. కాళేశ్వరంతో పాటు అన్ని అంశాల పైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. అది పీసీ గోష్ కమిషన్ కాదు, అది కాంగ్రెస్ పార్టీ వేసుకున్న పీసీసీ గోష్ కమిషన్.
దాని పైన కూడా కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








