Digital arrest in Hyderabad : ఆమె ప్రభుత్వ వైద్యురాలిగా (Retired doctor పనిచేసింది.. శారీరక, మానసిక రుగ్మతలకు చికిత్స చేసింది. రోగులకు మందులతోపాటు మనోధైర్యాన్ని నూరిపోసి ప్రాణాలను కాపాడింది. ఎలాంటి సందర్భాల్లోనైనా గుండె నిబ్బరం చేసుకోవాలని చెప్పిన ఆమె.. చివరిగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి భయాందోళనకు గురై ప్రాణాలు వదిలింది. హైదరాబాద్ (Hyderabad)లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపింది. సైబర్ మోసగాళ్లు (cyber fraudsters) ఎంత దారుణంగా, ఎంత కర్కశంగా అమాయకులను వలలోకి దింపుతున్నారో ఇది గుర్తుచేసింది.
Digital arrest : 70 గంటలపాటు వేధించి..
బాధితురాలు (76) రిటైర్డ్ వైద్యురాలు. సాధారణంగా తన పింఛను మీద ఆధారపడుతూ ప్రశాంత జీవితం గడుపుతోంది. సెప్టెంబరు 6న ఆమెకు ఓ ఫోన్‌కాల్ వచ్చింది. లిఫ్టు చేసిన వెంటనే అవతలి వ్యక్తులు తమను తాము పోలీసు అధికారులమని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులమని, ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతినిధులమని పరిచయం చేసుకున్నారు. “మీకు మానవ అక్రమ రవాణా (human trafficking) కేసులో ప్రమేయం ఉంది” అని చెప్పారు. సుప్రీంకోర్టు లోగోలు, నకిలీ కోర్టు నోటీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హెడ్‌ర్స్ ఉన్న ఫేక్ డాక్యుమెంట్లు చూపించారు. మీరు డిజిటల్ అరెస్టు అయ్యారంటూ విచారణ పేరుతో ఆమెను 70 గంటలపాటు ఫోన్, వీడియో కాల్స్ చేస్తూ వేధించారు. “ఈ కేసు నుంచి బయట పడాలంటే మీ ఖాతా నుంచి డబ్బులు పంపాలి. లేదంటే ఆస్తులు సీజ్ చేస్తాం” అని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన ఆమె చివరకు తన పింఛను ఖాతా నుంచి రూ.6.6 లక్షలు మోసగాళ్లు సూచించిన మహారాష్ట్రలోని ఒక బ్యాంకు ఖాతాకు బదిలీ చేసింది.
డబ్బులు పంపిన తర్వాత కూడా మోసగాళ్లు ఆగలేదు. వారు మళ్లీ మళ్లీ వీడియో కాల్స్ చేస్తూ నకిలీ కోర్టు నోటీసులు పంపిస్తూ “ఇంకా కేసు విచారణ కొనసాగుతుంది, మీరు సహకరించాలి” అంటూ వేధించారు. ఇలా నిరంతర మానసిక ఒత్తిడి, భయాందోళన కారణంగా సెప్టెంబరు 8న ఆమె గుండెపోటుకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ రిటైర్డ్ వైద్యురాలు తుదిశ్వాస విడిచింది.
Digital arrest : మరణించినా ఆగని ఫోన్‌కాల్స్
ఈ సంఘటనపై పోలీసులు (Police) వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఐటీ చట్టం కింద, అలాగే హత్య ప్రయత్నానికి సమానమైన “culpable homicide not amounting to murder” వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మోసగాళ్ల ఫోన్ రికార్డులు, బ్యాంక్ ఖాతా లావాదేవీలు, డిజిటల్ ట్రేస్‌లను ఆధారంగా చేసుకుని వారిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దారుణమేమిటంటే బాధితురాలు మృతి చెందిన తర్వాత కూడా సైబర్ నేరగాళ్లు ఆమె ఫోన్‌కు కాల్స్ చేస్తూ ఉన్నారు. ఆ డేటాను పోలీసులు సేకరించి సమగ్ర విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    