Hyderabad : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ (Aarogyasri), ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (JHS) సేవలు బంద్ అయ్యాయి. రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రాకపోవడంతో ఈ పథకాల కింద చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల (Private hospitals) యాజమాన్యాలు చేతులు ఎత్తేశాయి. తమకు బకాయి ఉన్నవేలకోట్ల నిధులను విడుదల చేయమని అనేక సార్లు విన్నవించినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ అసోసియేషన్ (TANHA) ప్రకటించింది.
విఫలమైన చర్చలు.. నిలిచిపోయిన సేవలు
తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) ప్రతినిధులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మంగళవారం చర్చలు జరిపారు. ఇవి సుదీర్ఘంగా కొనసాగాయి. అయినా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో TANHA ప్రతినిధులు ఓ నిర్ణయానికి వచ్చారు. బుధవారం అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ (Aarogyasri), ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (JHS) సేవలను నిరవధికంగా నిలిపివేశారు.
Aarogyasri : బకాయిలు ఎంత?
ప్రస్తుతం TANHAలో 323 ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. వీటిలో చిన్నవి, మధ్యతరహా, పెద్ద కార్పొరేట్ ఆస్పత్రులు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ పథకాల కింద పేదలకు ఉచిత చికిత్స అందిస్తూ బిల్లులను ప్రభుత్వానికి పంపిస్తాయి. అయితే.. ప్రభుత్వం తగిన సమయానికి బకాయిలను క్లియర్ చేయకపోవడం వల్ల ఈ ఆస్పత్రులు ఆర్థికంగా కుంగిపోతున్నాయి. ప్రస్తుతం రూ.1,400 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల వరకు ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం బకాయి ఉంది. ఇవి రాకపోవడంతో చిన్న ఆస్పత్రులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
“ప్రోటోకాల్ ప్రకారం రోగికి చికిత్స చేసిన తర్వాత గరిష్టంగా 40 రోజుల్లో రీయింబర్స్‌మెంట్ రావాలి. కానీ వాస్తవానికి ఇప్పుడు 400 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతోంది. చిన్న ఆస్పత్రుల నిర్వహణకు ఇది తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురిచేస్తోంది. జూలై నుంచి ఆగస్టు వరకు అనేకసార్లు చర్చలు జరిపినా ఇప్పటి వరకు బకాయిల్లో 7 శాతం కూడా రాలేదు” TANHA అధ్యక్షుడు డాక్టర్ వి. రాకేష్ తెలిపారు. బకాయిలను ప్రభుత్వం చెల్లించే వరకూ తమ సమ్మె కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
ఆందోళనలో రోగులు
ఈ సమ్మె ప్రభావం వేలాది పేద రోగుల (Patients)పై పడబోతోంది. గుండె శస్త్రచికిత్సలు, కిడ్నీ డయాలసిస్, క్యాన్సర్ చికిత్సలు.. ఇవన్నీ ప్రధానంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జరుగుతున్నాయి. ఆస్పత్రుల్లో సేవలు నిలిపివేయడం వల్ల పేదలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడక తప్పదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బు చెల్లించి చికిత్స చేయించుకోవడం సాధ్యం కాని తాము ప్రాణాలను ముప్పులో పెట్టుకోవాల్సి వస్తోందని రోగులు ఆందోళన చెందుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    