Next Gen GST : దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) ప్రకటించారు. నెక్ట్స్ జెన్ జీఎస్టీ (Next Gen GST) సంస్కరణలు (reforms) అమలులోకి వచ్చి రూ.2 లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థలోకి చేర్చబడ్డాయని ఆమె తెలిపారు. ఈ మార్పుల వల్ల ప్రజల జేబుల్లో మరింత డబ్బు మిగిలి సాధారణ కుటుంబాల ఖర్చులకు ఊరటనిచ్చిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో ఈ రోజు నిర్వహించిన Next Gen GST Reforms Outreach and Interaction Programలో ఆమె ప్రసంగించారు.
Next Gen GST : ప్రజల చేతుల్లో మిగులు డబ్బులు
పన్ను స్లాబ్‌లలో మార్పులు చేసి, ప్రజలకు ఆర్థికంగా ఊతం అందించామని నిర్మలా సీతారామన్ వివరించారు. గతంలో 12 శాతం జీఎస్టీ కింద ఉన్న వస్తువులలో 99 శాతం వస్తువులు ఇప్పుడు ఐదు శాతం స్లాబ్‌లోకి మారాయని తెలిపారు. అలాగే 28 శాతం జీఎస్టీ చెల్లించాల్సిన వస్తువుల్లో 90 శాతం ఇప్పుడు 18 శాతం కిందకి వచ్చాయని చెప్పారు. ఇలా స్లాబ్‌లను తగ్గించడం వల్ల దేశవ్యాప్తంగా రెండు ప్రధాన పన్ను స్లాబ్‌లు మాత్రమే మిగిలాయని, ఒకటి 5 శాతం, మరొకటి 18 శాతం అని ఆమె వివరించారు. “ఈ కొత్త జీఎస్టీ విధానం వల్ల ప్రజల చేతుల్లో డబ్బు మిగులుతోంది. అది నేరుగా మార్కెట్‌లోకి వెళ్లి ఆర్థిక వ్యవస్థ (economy)ను మరింత బలోపేతం చేస్తోంది” అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
పెరిగిన ఆర్థక స్వేచ్ఛ
జీఎస్టీ (GST) అమలులోకి వచ్చిన తర్వాత ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపించిందని మంత్రి తెలిపారు. 2018లో జీఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయం రూ.7.19 లక్షల కోట్లు కాగా 2025 నాటికి ఇది రూ.22.08 లక్షల కోట్లకు పెరిగిందని ఆమె వెల్లడించారు. అంటే.. దేశానికి మూడు రెట్ల కంటే ఎక్కువ ఆదాయం జీఎస్టీ వల్ల వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాక, జీఎస్టీ చెల్లించే పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని ఆమె చెప్పారు. జీఎస్టీ ప్రారంభ దశలో 65 లక్షల మంది మాత్రమే పన్ను చెల్లిస్తుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 1.51 కోట్లకు చేరుకుందని వివరించారు. ఈ పెరుగుదల వల్ల ప్రభుత్వానికి మరింత ఆదాయం వస్తూనే, దేశ ప్రజలకు కూడా ఆర్థిక స్వేచ్ఛ పెరుగుతోందని సీతారామన్ అన్నారు.
“ఈ నూతన జీఎస్టీ సంస్కరణలు పన్ను వ్యవస్థను సరళతరం చేయడం మాత్రమే కాకుండా, వ్యాపారాలకు సౌలభ్యం కల్పించాయి. అంతేకాదు.. ప్రజల ఖర్చులను తగ్గించి, ఆర్థిక వ్యవస్థలో చురుకుదనం తెచ్చాయి. ఈ విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది” అని తెలిపారు.
Next Gen GST : కొనుగోలు శక్తి బలోపేతం
జీఎస్టీ సంస్కరణలు అమలు అయిన తర్వాత మార్కెట్‌లో కొనుగోలు శక్తి పెరిగి, వస్తువుల ధరలు సాధారణ స్థాయిలోకి వచ్చాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలకు ఇది పెద్ద ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. ఈ విధంగా నెక్ట్స్ జెన్ జీఎస్టీ (Next Gen GST) సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపును ఇచ్చి, ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంస్కరణల ప్రయోజనాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    