Medaram Temple | ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆదివాసి జాతరగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం (Medaram Temple) అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. మేడారం ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో, పూజారుల అభిప్రాయాలు, ఆలోచనల మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఆలయ అభివృద్ధికి సంబంధించి డిజైన్లు దాదాపు ఖరారు చేశారు. సీఎం ఆమోదం తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. సీఎం ఆమోదం తర్వాత ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని శంకుస్థచేస్తారని మంత్రులు ప్రకటించారు.
ప్రస్తుతం మేడారం ఆలయ ప్రాంగణంలో ఒకేసారి సుమారు 7,000 మంది భక్తులు తల్లులను దర్శించుకునే సౌకర్యం ఉంది. అయితే విస్తరణ పనులు పూర్తయ్యాక, ఆ సామర్థ్యం 10,000 మందికి పైగా పెరగనుంది. ప్రాంగణం వెడల్పు, పొడవు పెరిగి మరింత విశాలంగా మారుతుంది. దీనివల్ల పెద్ద ఎత్తున వచ్చే భక్తులు సులభంగా, వేగంగా, క్రమపద్ధతిలో దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది.
సమ్మక్క, సారలమ్మలతో పాటు అదే వరుస క్రమంలో పగిడిద రాజు, గోవిందరాజు గద్దెలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్పుతో భక్తులు ఇబ్బంది లేకుండా, సమయం వృథా కాకుండా భక్తులు ఒకే దారిలో, సాఫీగా తల్లులను దర్శించుకునే వీలు ఉంటుంది. మేడారం ఆలయ పరిసరాల్లోకి ప్రవేశించగానే ఆదివాసి ఆధ్యాత్మిక భావన కలిగేలా సాంప్రదాయ ఆర్చులు నిర్మిస్తారు. ఆలయ ప్రాంగణం చుట్టూ రాతి పిల్లర్లు, వాటిపై ఆదివాసీ కళాత్మక ఆకృతులతో, ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేలా తీర్చిదిద్దన్నారు. తరతరాలు గుర్తుంచుకునేలా ఈ రాతి కట్టడాలు శాశ్వత చిహ్నాలుగా నిలిచిపోతాయి.
అలాగే భక్తుల భద్రత దృష్ట్యా, మేడారం ప్రాంగణం చుట్టూ నాలుగు వాచ్ టవర్లు నిర్మించాలని భావిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే జాతర కాలంలో ఈ వాచ్ టవర్లు విజిలెన్స్, సెక్యూరిటీ, కంట్రోల్లో కీలకపాత్ర పోషించనున్నాయి. మేడారం గుడి అభివృద్ధి పనులకు సంబంధించి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి, త్వరలో సీఎం ఆమోదంతో పనులు ప్రారంభమవుతాయని మంత్రులు తెలిపారు. మేడారం అభివృద్ధి కేవలం సదుపాయాలు పెంపునకే పరిమితం కాకుండా, ఆదివాసీ సంస్కృతిని, విశ్వాసాన్ని, వారసత్వాన్ని మరింత బలంగా ప్రతిబింబించేలా రూపకల్పన జరుగుతోందని మంత్రులు స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    