Bathukamma festival : బతుకమ్మ పండుగ ను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ (Telangana tourism) ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సెప్టెంబరు 21 నుంచి 30 వరకు జరిగే ఈ తొమ్మిది రోజుల పూల పండుగను ఈసారి మరింత వైభవంగా జరపాలని సంకల్పించింది. ఈ సారి కూడా బతుకమ్మ ఉత్సవం వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి (Thousand Pillar Temple) వద్ద ప్రారంభమవుతుంది. ఈ ప్రదేశం తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. పూలతో అలంకరించిన బతుకమ్మలను మహిళలు పురాతన కట్టడాల మధ్య సమూహంగా ఆడుతూ పాడుతూ జరుపుకోవడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.
కొంగొత్త తరహాలో Bathukamma festival
బతుకమ్మ ఉత్సవాల ((Bathukamma festival)ను ఈ సారి రియో కార్నివల్ తరహాలో నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Tourism minister Jupally Krishna Rao) తెలిపారు. ప్రపంచ పర్యాటకులను తెలంగాణ వైపు ఆకర్షించడానికి ఇది ఒక కొత్త ప్రయోగం కానుందన్నారు. దీని ద్వారా తెలంగాణ సంస్కృతి, సంగీతం, నృత్యం, సంప్రదాయాలను ప్రపంచ స్థాయిలో ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్ టెక్నాలజీ నైపుణ్యత, వరంగల్ చారిత్రక వారసత్వం ఈ రెండు కలగలసి తెలంగాణను పర్యాటకులకు ఒక అద్భుత అనుభూతి కలిగించే విధంగా ఉండబోతున్నాయని జూపల్లి అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే విశ్వవిఖ్యాత వేడుక అని అన్నారు.
రియో కార్నివల్ అంటే ఏమిటి?
రియో కార్నివల్ (Rio Carnival) అనేది ప్రపంచ ప్రసిద్ధమైన పండుగ. ఇది ప్రతి సంవత్సరం బ్రెజిల్‌లోని రియో డి జనీరో (Rio de Janeiro) నగరంలో జరుగుతుంది. దీనిని సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చిలో నిర్వహిస్తారు. కార్నివల్ అనేది రంగులు, సంగీతం, నృత్యం, ఊరేగింపులతో నిండిన ఉత్సవం. ఇందులో సాంబా డ్యాన్స్ పరేడ్ అనేది ప్రత్యేక ఆకర్షణ.
ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ఈ ఉత్సవాన్ని చూడటానికి వస్తారు. దీన్ని ప్రపంచంలోనే అత్యంత పెద్ద వీధి పండుగ (The Greatest Show on Earth) అని కూడా పిలుస్తారు. ఇది కేవలం బ్రెజిల్‌కే కాకుండా ప్రపంచ పర్యాటక రంగానికి చిహ్నంగా మారింది.
పర్యాటకానికి కొత్త దారులు
బతుకమ్మను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. తెలంగాణలో పర్యాటక రంగానికి ఇది కొత్త మార్గాలకు దోహదం చేస్తుందని భావిస్తోంది. తెలంగాణ పర్యాటకం కేవలం రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కాకుండా సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా మారబోతోందని అంటోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








