Next-Gen GST : తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా నెక్ట్స్ జనరేషన్ జీఎస్టీ (next generation GST) విధానాన్ని అమల్లో తెచ్చేందుకు రంగం సిద్ధమైందని వాణిజ్య పన్నుల కమిషనర్ కె.హరిత (K Haritha, Commissioner of Commercial Taxes) వెల్లడించారు. కేంద్ర జీఎస్టీ కౌన్సిల్ తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం పన్ను స్లాబ్స్‌లో మార్పులు చేసి కొత్త నోటిఫికేషన్లు (notifications) విడుదలయ్యాయని, వాటిని రాష్ట్రం వెంటనే అమలులోకి తెచ్చిందని ఆమె ఈ రోజు వెల్లడించారు.
‘మా విభాగం ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులు కొత్త పద్ధతిని ఎలా అనుసరించాలో వివరించాం. అయినప్పటికీ అసలు సమస్యలు వచ్చే నెలలో రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో మాత్రమే బయటపడతాయి’ అని అని కూడా హరిత తెలిపారు. ప్రస్తుతం తమ విభాగం తరఫున ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని కమిషనర్ స్పష్టం చేశారు. అయితే.. వ్యాపారులు తమ బిల్లింగ్ సిస్టమ్స్‌ను కొత్త విధానానికి అనుగుణంగా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉందని సూచించారు. ‘జీఎస్టీఎన్ (Goods and Service Tax Network) సాంకేతిక సమస్యలను పర్యవేక్షిస్తోంది. కాబట్టి ఎలాంటి పెద్ద ఇబ్బంది తలెత్తకపోవచ్చని ఆశిస్తున్నాం’ అన్నారు.
Next-Gen GST ముఖ్యోద్దేశం
జీఎస్టీ (goods and services tax) వ్యవస్థను సరళీకరించడం, పారదర్శకత పెంచడం, సామాన్య పౌరులు, వ్యాపారులకు సులభతరం చేయడమే ఈ సంస్కరణల ముఖ్యోద్దేశమని అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు అనేక రకాల పన్ను స్లాబ్స్ ఉండగా, ఇప్పుడు రెండు ప్రధాన స్లాబ్స్ 5 శాతం, 18 శాతం మాత్రమే ఉండనున్నాయని ఇప్పటికే ప్రకటించింది. ఈ విధానం వల్ల వ్యాపారులకు గందరగోళం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
జీఎస్టీ రిజిస్ట్రేషన్లు.. వ్యాపార ప్రభావం
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 5.3 లక్షల జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఇవి కలిగి ఉన్న వారందరూ కొత్త విధానాన్ని ((Next-Gen GST ) అనుసరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, మధ్యస్థాయి వ్యాపారులు తమ ఖాతాలు, బిల్లింగ్ సాఫ్ట్‌వేర్లలో మార్పులు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మొదటి నెలల్లో కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. అయిన్నప్పటికీ తర్వాత పరిస్థితులు సర్దుబాటు అవుతాయని అధికారులు భావిస్తున్నారు.
Next-Gen GST : రాష్ట్ర ఆదాయానికి గండి!
కొత్త పన్ను విధానం అమలుతో రాష్ట్రానికి గణనీయమైన ఆదాయ నష్టం వాటిల్లనుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సంవత్సరానికి సుమారు రూ. 7 వేల కోట్లు తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వ అంచనా. ఈ లోటును కేంద్ర ప్రభుత్వం పరిహరించాల్సిన అవసరం ఉందని కోరుతోంది. లేదంటే రాష్ట్ర ఆదాయానికి గండి అవకాశముందని అంటోంది.
వ్యాపారుల ప్రతిస్పందన
రాష్ట్ర వ్యాపార సంఘాలు ఈ సంస్కరణలపై మిశ్రమ స్పందన వ్యక్తం చేశాయి. కొందరు వ్యాపారులు పన్ను స్లాబ్స్ సరళీకరణతో లావాదేవీలు సులభతరం అవుతాయని స్వాగతిస్తుండగా, మరికొందరు మాత్రం ఆదాయ నష్టం, ధరల మార్పులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సవాళ్లు ఎదురైనా..
కొత్త విధానం మొదటి కొన్ని నెలలపాటు సవాళ్లు ఎదురుకావచ్చని నిపుణులు అంటున్నారు. కానీ దీర్ఘకాలంలో పారదర్శకత పెరగడం, వ్యాపారులు సులభంగా పన్నులు చెల్లించడం, అవినీతి తగ్గడం వంటి ప్రయోజనాలు దక్కే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కూడా ఈ సంస్కరణలు ఉపకరిస్తాయని అంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    