Bathukamma World Record : తెలంగాణ (Telangana)కు ప్రత్యేకతను తెచ్చిపెట్టే పండుగల్లో బతుకమ్మ (Bathukamma) మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి ఏడాది దసరా సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరించి ఆడిపాడుతూ సంబరాలు జరుపుకుంటారు. దేశ విదేశాల్లోనూ ఈ వేడుకకు బహు ఆదరణ లభిస్తోంది. ఈసారి బతుకమ్మ మరింత ప్రత్యేకతను చాటనుంది. ప్రపంచ రికార్డు (World Record)ను సృష్టించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో బతుకమ్మను తయారు చేసి ఆడబోతున్నారు.
ఎల్‌బీ స్టేడియంలో భారీ వేడుక
హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియం (LB Stadium)లో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 28న ఒక విస్తృతమైన బతుకమ్మ వేడుకను నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంలో 10,000 మంది మహిళలు ఒకేసారి బతుకమ్మ ఆడేందుకు ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా, అక్కడ ఏర్పాటు చేయబోయే బతుకమ్మ ఎత్తు 60 అడుగుల వరకు ఉండనుంది. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో, ఇది చరిత్రలోనే అతి పెద్ద బతుకమ్మగా నిలుస్తుంది.
ఓనం రికార్డును అధిగమించాలన్న లక్ష్యం
ఈ వేడుకతో తెలంగాణ మహిళలు కేవలం పండుగను జరుపుకోవడమే కాకుండా ఒక ప్రపంచ రికార్డును కూడా సాధించాలనుకుంటున్నారు. 2023లో కేరళలోని త్రిస్సూర్‌లో జరిగిన ఓనం (Onam festival) సందర్భంగా 7,027 మంది మహిళలు ఒకేసారి తిరువాథిర నృత్యం చేసి రికార్డు నెలకొల్పారు. ఆ రికార్డును అధిగమించాలన్నదే తెలంగాణ లక్ష్యం. ఎల్‌బీ స్టేడియంలో జరిగే ఈ బతుకమ్మ ఆడపాట రికార్డు పుస్తకాల్లో కొత్త అధ్యాయాన్ని రాయనుంది.
Bathukamma : ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం
ఈ భారీ వేడుకను విజయవంతం చేయడానికి ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కలిసి పనిచేస్తున్నాయి. సాంస్కృతిక, భాషా శాఖ డైరెక్టర్ ఎనుగుల నరసింహారెడ్డి మాట్లాడుతూ “ఈ వేడుక తెలంగాణను ప్రపంచ పటంలో మరింతగా నిలబెట్టే అద్భుతమైన కార్యక్రమం అవుతుందిష అన్నారు. GHMC కూడా ప్రత్యేక కార్యక్రమాలను సిద్ధం చేస్తోంది.
ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు
దసరా రోజుల్లో ప్రతి రోజూ హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 30న సచివాలయం ఎదురుగా అమరవీరుల దీపం వద్ద బతుకమ్మ ప్రదర్శన ఏర్పాటు చేయబడుతుంది. అనంతరం అక్కడి నుంచి ట్యాంక్‌బండ్ వరకు ప్రత్యేక శోభాయాత్రగా బతుకమ్మలను తీసుకెళ్లనున్నారు. ఇది నగర ప్రజలందరినీ ఆకర్షించే ఒక ముఖ్యమైన వేడుక కానుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    