Gold Price Today : కొద్దిరోజులుగా బంగారం ధరలు తారాజువ్వలా నింగికెగసిపోతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో బంగారం ధర రోజుకో సరికొత్త రికార్డును నమోదు చేస్తోంది. మొన్నటి వరకు 10 గ్రాముల ధర రూ.లక్ష దాటితేనే అవాక్కయిన జనం తాజాగా రూ.1.25 లక్షలకు చేరుకోవడం చూసి షాక్ అవుతున్నారు. పుత్తడి ఔన్సు తొలిసారి 4వేల డాలర్ల మార్కును దాటింది. అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్డౌన్, ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై నెలకొన్న అనిశ్చితులు పసిడికి తాజాగా డిమాండ్ పెంచుతున్నాయి. బంగారం ధర బుధవారం మరింత పెరిగింది. ఒక్కరోజే రూ.2,290 పెరిగి గరిష్ఠ స్థాయికి చేరింది.
హైదరాబాద్లో ధరలు ఇలా..
Gold Price in Hyderabad : హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర బుధవారం తొలిసారి రూ.1,26,070కి ఎగబాకింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,750కి చేరింది. మరోవైపు వెండి ధర కూడా బంగారంతో పోటీపడి మరీ పెరిగిపోతోంది. హైదరాబాద్లో కిలో వెండి రూ.1.58 లక్షలుగా ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరోవైపు డాలరుతో రూపాయి మారకం విలువ 88.79గా ఉంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు బంగారానికి డిమాండ్ పెంచుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యంపై టారిఫ్ల ప్రభావం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, కేంద్ర బ్యాంకులు కొనుగోళ్ల కారణంగా సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే పుత్తడి వైపు పెట్టుబడులు మళ్లడమే దీనికి కారణం. దాదాపు రెండేళ్లక్రితం ఔన్సు బంగారం ధర 2 వేల డాలర్ల దిగువనే ఉండేది. అలాంటిది ఈ ఒక్క క్యాలెండర్ సంవత్సరంలోనే దాదాపు 50 శాతం మేర పెరగడం గమనార్హం.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    