తెలంగాణను ఇన్నోవేషన్ హబ్‌గా మారుస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు
Warangal | త్వరలోనే వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University), నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయాలతో ఇంక్యుబేషన్ సెంటర్లను (Incubation Centers) ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లుగా ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar babu) వెల్లడించారు.
తెలంగాణను “ఇన్నోవేషన్ హబ్” గా మార్చాలన్నదే తమ సంకల్పమని, వరంగల్, నల్గొండలోనూ టీ-హబ్ తరహాలో ఇంక్యూబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అలుమ్ని’ గోల్డెన్ జూబ్లీ వేడుకలను శనివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… సైన్స్ కు మానవత్వాన్ని జోడిస్తే ప్రతి ఆవిష్కరణ సమాజహితానికి బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణను గ్లోబల్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్ గా మాత్రమే కాకుండా ‘ఫార్మసీ ఆఫ్ పర్పస్’గానూ మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. రీసెర్చ్ ను మార్కెట్‌కు, పాలసీని రోగికి అనుసంధానించే సమగ్రమైన 360 డిగ్రీల ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
లైఫ్ సైన్స్ రంగంలో రూ.54వేల కోట్ల పెట్టుబడులు
18 నెలల్లోనే లైఫ్ సైన్సెస్ (Life Sciences) రంగంలో కొత్తగా రూ.54వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. ఎలీ లిల్లీ లాంటి అంతర్జాతీయ ఫార్మా దిగ్గజ కంపెనీలను తెలంగాణకు తీసుకొచ్చి, ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృసి చేస్తున్నామని తెలిపారు. దేశంలో తమ అనుభవాన్ని ‘నాలెడ్జ్ ఇన్వెస్ట్ మెంట్’గా పెట్టేందుకు ముందుకు రావాలని ప్రవాసీ భారతీయ నిపుణులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. పేటెంట్లను కాకుండా మీ ఆవిష్కరణ వల్ల ఎంత మందికి మేలు జరిగిందన్నదే చరిత్ర గుర్తుంచుకుంటుందని యువ ఇన్నోవేటర్స్ కు ఆయన దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి, డా.బి.ప్రభా శంకర్, రాంప్రసాద్ రెడ్డి, ప్రద్యుమ్న, డా.తామర విజయ్ కుమార్, ప్రొఫెసర్ భాస్కర్ ఆర్.జాస్తి, రాజేశ్వర్ తోట, ప్రొఫెసర్ జె. కృష్ణవేణి పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    