- జిల్లాలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షపాతం
- మానుకోట, డోర్నకల్, వరంగల్ రైల్వే స్టేషన్లలో నీటమునిగిన రైలు పట్టాలు
- ఎక్కడికక్కడే నిలిచిపోయి పలు రైళ్లు.. మరికొన్ని రైళ్ల దారి మళ్లింపు
Warangal Rains | తుపాను మొంథా ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. వరంగల్ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదు కాగా, ఆ తర్వాత వరంగల్ జిల్లా కాపులకనపర్తిలో 25.23, రెడ్లవాడలో 24.63, సంగెంలో 23.48, వర్ధన్నపేటలో 22.8, సెంటీమీటర్ల వర్షం కురిసింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 21.8, జనగామ జిల్లా గూడురులో 23.58, మహబూబాబాద్ జిల్లా ఇనగుర్తిలో 19.23, కరీంనగర్ జిల్లా బోర్నపల్లిలో 17.58, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 16.45, యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 16.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో హన్మకొండ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 79819 75495 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో రైల్వేస్టేషన్‌లోకి భారీగా వరద నీరు చేరింది. పట్టాలపైకి భారీగా వరద చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు రెండు అడుగుల మేర నీరు నిలిచిపోయింది. రైల్వేట్రాక్‌పై నీరు నిలిచిపోవడంతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. ప్రయాణికులను బస్సుల్లో పంపించివేస్తున్నారు. మరోవైపు మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఐదు గంటల పాటు నిలిచిపోయింది. రైలు పట్టాలపై నీరు తగ్గకపోవడం వరంగల్‌కు తిప్పిపంపి.. రైలును దారి మళ్లించారు. గుండ్రాతిమడుగు నుంచి వరంగల్‌కు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను తిప్పి పంపారు. ప్రయాణికులకు ఆహార పానియాలను పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు అందించాయి. మానవతా సహాయం అందించిన పోలీసులను డీజీపీ అభినందించారు. ఇదిలా ఉండగా.. డోర్నకల్ రైల్వేస్టేషన్‌ను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.
రైల్వే స్టేషన్‌లో నుంచి వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కురవి మండలం గుండ్రాతిమడుగు పెద్ద చెరువుకు బుంగ పడడంతో కట్ట కుంగిపోయింది. పాకాల చెరువు పొంగడంతో గార్ల, మద్దివంచ, రామపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వట్టివాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కేసముద్రం-గూడురు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు హన్మకొండ బస్టేషన్‌లోకి భారీగా వరద నీరు చేరింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    