వరంగల్ వరద బాధితుల సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం
Warangal : మొంథా తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లా అతలాకుతలమైంది.. భారీ వరదల కారణంగా అనేక కాలనీలు పూర్తిగా మునిగిపోయి ప్రజలకు నిలువ నీడ లేకుండా పోయింది. అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు వరద బాధితులను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, పోలీసు విభాగం, విపత్తు నిర్వహణ యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన సీఎం.. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని, ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలో చిక్కుకున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైతే డ్రోన్ల సాయంతో తాగునీరు, ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయాలనని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అవసరమైనన్ని పడవలు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది వరంగల్‌కు పంపించాలని సీఎస్, డీజీపీకి సూచించారు. హైడ్రా వద్ద ఉన్న వరద సహాయక సామాగ్రిని అత్యవసర ప్రాంతాల్లో వినియోగించాలని సీఎం ఆదేశించారు.
ఇదీ చదవండి: మొంథా ఎఫెక్ట్ నేడూ వర్షాలు..
ఇది వరి కోతల కాలం. తుఫాను ప్రభావం రైతులకు ఆవేదన కలిగిస్తోందని, అయినా ప్రాణ నష్టం జరగకుండా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
అధికారులకు సెలవులు రద్దు
అన్ని జిల్లా కలెక్టర్ల సెలవులను రద్దు చేస్తూ, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ శాఖ ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై బ్రిడ్జిలు, లోలెవల్ కాజ్‌వేలు వద్ద ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి బయటకు రావొద్దని అవగాహన కల్పించాలని ఆదేశించారు.
Warangal : రేపు ఏరియల్ సర్వే
వరంగల్‌లో తుఫాను ప్రభావం అధికంగా ఉండటంతో సీఎం రేవంత్ గురువారం నాటి పర్యటనను వాయిదా వేసుకున్నారు. శుక్రవారం, వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తామని చెప్పారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఇంచార్జ్ మంత్రులు, కలెక్టర్లు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, పశు నష్టం, పంట నష్టం నివారించేందుకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    