Aadhaar based attendance : వైద్య సిబ్బందికి ఆధార్ ఆధారిత అటెండెన్స్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం (Telangana government) ప్రవేశపెడుతోంది. ఇది రాష్ట్రంలోని అన్ని జిల్లా వైద్యాధికారుల (DHO) పరిధిలో ఉండే ఆస్పత్రుల్లో అమలు చేయనుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు (UPHC), ఆయుష్మాన్ హెల్త్ మందిరాలు (బస్తీ, పల్లె ఆస్పత్రులు) వంటి ఆరోగ్య కేంద్రాల్లో ఈ కొత్త హాజరు విధానాన్ని తక్షణమే అమలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Aadhaar based attendance : ఖమ్మం జిల్లాలో తొలిసారి..
వైద్య సిబ్బందికి ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని ( Aadhaar-based Attendance System (ABAS) ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అది విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమల్లోకి తెస్తున్నారు. కొత్త విధానానుసారం వైద్య సిబ్బంది తమకు కేటాయించిన ఆస్పత్రుల్లో విధులకు హాజరైనప్పుడే వారి హాజరు నమోదవుతుంది. తద్వారా ఉద్యోగుల హాజరులో పారదర్శకత ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త విధానం సక్రమంగా అమలు చేయడానికి ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది.
వైద్య సిబ్బంది అభ్యంతరాలు
హాజరు పద్ధతిని పకడ్బందీగా చేపట్టాలనే లక్ష్యంతో ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని (Aadhaar-based Attendance System (ABAS) ప్రవేశపెట్టామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు వైద్య సిబ్బంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది తమకు ఒత్తిడిని పెంచుతుందని భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా వైద్య సిబ్బంది సమయానికి విధుల్లో హాజరు కావడం నిర్ధారించొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, కొన్ని ఆస్పత్రులు మారుమూల ప్రాంతాల్లో ఉండటం, ఇంటర్నెట్ సదుపాయం పూర్తిగా అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని సిబ్బంది అంటున్నారు. ఈ విధానాన్ని అమలు చేసే ముందు వైద్య సిబ్బందితో చర్చించకపోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఫసియుద్దీన్, ప్రధాన కార్యదర్శి యాదనాయక్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విధానం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తరచుగా బయోమెట్రిక్ సమస్యలు
దేశంలోని అనేక ప్రాంతాలలో ఆధార్ ఆధారిత వ్యవస్థలలో సాంకేతిక లోపాలు తరచుగా ఉంటున్నాయి. బయోగమెట్రిక్ సెన్సార్లు సరిగ్గా పని చేయకపోవడం, నెట్వర్క్ సమస్యలు తలెత్తడం వంటి విషయాలు ముందుగా పరిష్కరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం ద్వారా తమ వ్యక్తిగత వివరాలు అనవసరంగా రికార్డవుతాయని, ఇది గోప్యతా హక్కులకు భంగం కలిగించవచ్చని కొంతమంది వైద్యులు అంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








