Telangana Aarogyasri Shceme : ఆరోగ్యశ్రీ సేవలు మరోమారు పునరుద్ధరణకు నోచుకున్నాయి. ఈ వైద్య సేవలు మళ్లీ కొనసాగుతాయని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) వెల్లడించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో నిన్న జరిగిన చర్చలు సఫలమయ్యాయని, దీంతో నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరణ అవుతాయని వివరించింది. మంత్రి హామీతో నిన్న రాత్రి 10 గంటల నుంచే ఆరోగ్యశ్రీతోపాటు ఈహెచ్ఎస్, జేహెచ్‌ఎస్ సేవలను యథావిధిగా అందిస్తామని నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం (TANHA) అధ్యక్షుడు డాక్టర్ రాకేశ్ తెలిపారు. పెండింగ్ బకాయుల చెల్లింపుపై మంత్రి దామోదర స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఐదారు నెలల్లో బకాయిలు చెల్లిస్తామని మంత్రి చెప్పారని పేర్కొన్నారు.
Aarogyasri Shceme : ఆరోగ్యశ్రీ బిల్లులపై సమ్మె.. చర్చలు సఫలం
ఆరోగ్యశ్రీ బిల్లులు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో వాటిని చెల్లించాలని కోరుతూ ప్రేవేటు ఆస్పత్రులు ఈ నెల 10 నుంచి అత్యవసరేతర సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. పెండింగ్ బిల్లులతోపాటు దాదాపు పదేళ్లుగా అనేక సమస్యలు నెలకొన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని TANHA వివరించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Demodara Rajanarsimha) జరిగిన సమావేశంలో చర్చలు సఫలమయ్యాయి.
ఐదారు నెలల్లో ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తాం: మంత్రి దామోదర
ప్రైవేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులను చెల్లించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదరరాజనర్సింహ హామీ ఇచ్చారు. ఐదారు నెలల్లో బకాయులను పూర్తిగా చెల్లిస్తామని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల ఎంప్యానెల్ ఎంవోయూ, ప్యాకేజీ ధరల పెంపునకు సంబంధించిన సమస్యలపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇతర సమస్యలపై చర్చించేందుకు ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఆరోగ్యశ్రీ సీఈవోతో సమావేశం ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆరోగ్యం, విద్య రంగాల కోసం నిధులు కేటాయించడంలో ఎటువంటి రాజకీయ పక్షపాతం ధోరణిని అవలంబించేది లేదని స్పష్టం చేశారు. TANHA ప్రతినిధులకు ప్రభుత్వం ద్వారా మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు : TANHA
ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులపై మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వడంతో తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ (Aarogyasri Shceme Network Hospitals ) అసోసియేషన్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టమైన హామీ ఇచ్చారని, దీంతో నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సేవలను పునరుద్ధరిస్తామని TANHA అధ్యక్షుడు డాక్టర్ రాకేశ్ వెల్లడించారు. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపుల విషయంలో సానుకూలతను ప్రదర్శించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..