భారతీయ రాష్ట్రీయ సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీ రామారావు (KTR) అవినీతి నిరోధక సంస్థ (ACB) ఎదుట హాజరయ్యారు. ఫార్ములా -ఈ అక్రమాల కేసులో ఆయన్ను ఏసీబీ ప్రశ్నించనుంది. అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ మిసాప్రోప్రియేషన్, క్రిమినల్ మిస్‌కండక్ట్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, క్రిమినల్ కన్‌స్పిరసీకి సంబంధించిన IPC సెక్షన్ల కింద కేసులను కేటీఆర్ (KT Rama Rao) ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు సుమారు ₹55 కోట్ల నష్టం కలిగించాయని ప్రధాన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఈ కేసులు నమోదయ్యాయి.
న్యాయవాది తోడుగా రాగా..
విచారణ సమయంలో కేటీఆర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు అనుమతించింది. అయితే.. ఏసీబీ ప్రశ్నించే సమయంలో న్యాయవాది జోక్యం అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. దూరం నుంచి చూసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తరఫున ఏసీబీ కార్యాలయానికి ప్రముఖ న్యాయవాది రామచంద్రన్ రావు హాజరయ్యారు. ఏసీబీ ప్రశ్నించడానికి ముందు రోజు కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన న్యాయవాది తన వెంట ఉండేందుకు ACB కు ఆదేశాలు ఇవ్వాలని కోరగా హైకోర్టు ఈ మేరకు అనుమతించింది.
ACB విచారణను వాయిదా వేయాలని కోరిన KTR
BRS అధికారంలో ఉన్నప్పుడు 2023లో జరిగిన ఫార్ములా-ఈ రేస్ (Formula E CAR RACE) నిర్వాహణలో జరిగిన ఆర్థిక అక్రమాలను ACB దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 6న కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే.. తన న్యాయవాదిని అనుమతించకుండా ప్రశ్నించడానికి ప్రయత్నించడంతో కేటీఆర్ ACB ఆఫీసు నుంచి తిరిగి వెళ్లిపోయారు. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు వచ్చే వరకు ప్రశ్నించడాన్ని వాయిదా వేయాలని కోరుతూ కేటీఆర్ ACB కి లేఖ సమర్పించారు. అనంతరం హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఏసీబీ విచారణను వాయిదా వేయాలని అభ్యర్థించారు.
క్వాష్ పిటిషన్ కొట్టివేత
కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఈ క్రమంలోనే జనవరి 9న విచారణకు హాజరుకావాలని ACB ఆయనకు మరో నోటీసు జారీ చేసింది. దీంతో ఆయన ఈరోజు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే: కేటీఆర్
ఏసీబీ విచారణకు హాజరుకావడానికి ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను ఖండించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..