AI Primary schools in Telangana | విద్యారంగంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టగా కొత్తగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయబోతోంది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల (Primary schools) విద్యార్థుల పాఠ్యాంశాల్లో కృత్రిమ మేధస్సు (Artificial intelligence (AI)ను చేర్చాలని విద్యా శాఖ (Education department) నిర్ణయించుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (academic year) నుంచి ఇది అమల్లోకి రానుంది.
AI in Primary schools : ఏయే క్లాసులు అంటే..1
రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి రూపొందిస్తున్న కొత్త పాఠ్య ప్రణాళిక ప్రకారం మొదటి తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులు (primary students) కంప్యూటర్‌తో పాటు AI, డిజిటల్ రంగంలోని ప్రాథమిక అంశాలను నేర్చుకోనున్నారు. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు ఆధునిక టెక్నాలజీపై అవగాహన కలిగించాలనే లక్ష్యంతో మొదటి, రెండో తరగతి విద్యార్థులకు కంప్యూటర్ విద్యను పరిచయం చేయనున్నారు. అలాగే.. నాలుగు, ఐదో తరగతి విద్యార్థులకు AI ప్రాథమిక అంశాలను బోధించనున్నారు.
పైలట్ ప్రాజెక్టుగా 20 జిల్లాల ఎంపిక
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా (pilot project) 20 జిల్లాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో Artificial intelligence (AI) పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. కరీంనగర్, వికారాబాద్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జనగామ, మంచిర్యాల, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, నిర్మల్, సంగారెడ్డి, ములుగు, మెదక్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను ఎంపిక చేశారు. వీటిలోని 100 ప్రాథమిక పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను బోధించనున్నారు.
AI in Primary schools : విద్యా శాఖ కసరత్తు
ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడానికి ఆయా జిల్లాల కలెక్టర్లకు విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగిత రాణా దిశా నిర్దేశం చేశారు. ఎంపిక చేసిన 100 ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ల కోసం ఏప్రిల్ 3, 4 తేదీల్లో హైదరాబాద్‌లోని MCR HRD ఇన్స్టిట్యూట్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఏప్రిల్ 21, 22 తేదీల్లో తమ తమ పాఠశాలల్లో విద్యార్థులకు AI పాఠాలు బోధించనున్నారు.
అంతేకాకుండా ప్రాథమిక స్ధాయిలో అక్షరాస్యత, గణిత నైపుణ్యాలను (FLN) పెంచే దిశగా AI ఆధారిత ఉపాయాలను వినియోగించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 513 ప్రాథమిక పాఠశాలల్లో AXL (FLN-AI) ప్రోగ్రామ్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులకు వారి గతి ప్రకారం అభ్యాసం చేసుకునే అవకాశం లభిస్తుంది. తద్వారా వారి ప్రాథమిక అక్షరాస్యత, గణిత నైపుణ్యాలు మెరుగుపడే అవకాశముంది. ఇది ప్రాథమిక విద్యార్థులకు డిజిటల్ నేర్చుకునే విధానంపై ఆసక్తిని పెంచటంతో పాటు, భవిష్యత్ టెక్నాలజీపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడుతుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..