WhatsApp governance : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కోసం అనేక వినూత్న విధానాలను తీసుకొస్తోంది. అందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ (WhatsApp governance) అనే కొత్త పరిపాలనా విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పౌరసేవలను అత్యంత వేగంగా, పారదర్శకంగా అందించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ (AP govt) ముఖ్యోద్దేశం.
WhatsApp governance లో ఎన్ని సేవలు?
WhatsApp governance in AP : వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమం ద్వారా ప్రజలు 161 రకాల సేవలను పొందొచ్చు. దేవదాయ(Endowment Deportment), ఇంధనం, ఏపీఎస్ ఆర్టీసీ(APSRTC), రెవెన్యూ, మునిసిపాలిటీ తదితర విభాగాల సేవలు అందుబాటులో ఉంటాయి. పౌరులు తమ మొబైల్ ఫోన్ నుంచే తేలికగా సేవలను పొందేలా ఈ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించారు. ప్రభుత్వానికి నేరుగా సమస్యలను దరఖాస్తులు, విజ్ఞాపణల ద్వారా తెలియజేసే వీలుంటుంది. వాటిని అధికారులు సమీక్షించి తగిన చర్యలు చేపడతారు. ఈ విధానం పూర్తిగా పారదర్శకతతో కూడుకొని ఉంటుందని ప్రభుత్వం అంటోంది. ప్రజలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులభంగా వేగవంతమైన సేవలను పొందొచ్చని పేర్కొంది.
ఎలా పని చేస్తుంది?
వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రభుత్వ సేవలను డిజిటల్ రూపంలో మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రూపొందించబడింది. ప్రజలు తమ సమస్యలను వాట్సాప్ ద్వారా నమోదు చేయాలి. సంబంధిత శాఖలు వాటిని పరిశీలించి, తగిన పరిష్కారాన్ని అందిస్తాయి. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సమస్యల పరిష్కారం మరింత సత్వరంగా లభిస్తుంది.
చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం
పౌర సేవలను పారదర్శకత, వేగవంతంగా అందించి తద్వారా ప్రజలతో నేరుగా సంబంధాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్నిచంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం (Andhra Pradesh government) ప్రారంభిస్తోంది. ముఖ్యంగా సమాచార గోప్యతను దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించారు. ప్రజల ఫిర్యాదులు, అభ్యర్థనలపై తక్షణమే స్పందించేలా అధికారులను సమర్థంగా నియమించనున్నారు. ఈ కొత్త విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief minister N. Chandrababu Naidu) అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సేవలను వినియోగించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రాజెక్ట్ విజయవంతంగా అమలు కావడానికి అవసరమైన సాంకేతిక మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి పెట్టారు.
WhatsApp governance లో ఏమేం ఉన్నాయి?
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రారంభ దశలో 161 సేవలను ప్రవేశపెడుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఇందులో చేర్చే యోచనలో ప్రభుత్వం ఉంది. అందుబాటులోకి వస్తున్న కొన్ని ముఖ్యమైన సేవలు ఏమిటంటే..
- రేషన్ కార్డ్ (Ration Cards) సంబంధిత సేవలు
- జనన మరణ ధృవీకరణ పత్రాలు
- ఆరోగ్య సంబంధిత సమాచారం
- ఎలక్ట్రిసిటీ బిల్లులు, నీటి బిల్లులు చెల్లింపు
- రోడ్లు, మురుగు కాల్వలు, పారిశుద్ధ్య సమస్యల నివేదిక
- ఎమర్జెన్సీ సేవల (అంబులెన్స్, పోలీసు) సమాచారం
- ప్రభుత్వ పథకాలు, వాటి వివరాలు
నేరుగా సమస్యలు చెప్పుకొనే విధానం
ఇప్పటివరకు ప్రజలు తమ సమస్యలను అధికారులకు తెలియజేయాలంటే అనేక ఆటంకాలు ఎదుర్కొనేవారు. కానీ ఇప్పుడు వాట్సాప్ ద్వారా నేరుగా ప్రభుత్వానికి సమస్యను తెలియజేసి, త్వరితగతిన పరిష్కారం పొందొచ్చు. ఈ విధానం ద్వారా ప్రజల నిత్యజీవిత సమస్యలు తక్షణమే పరిష్కారం అవ్వడమే కాకుండా ప్రభుత్వ సేవల ప్రామాణికత కూడా పెరుగుతుంది.
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త వాట్సాప్ గవర్నెన్స్ (WhatsApp governance ) కార్యక్రమం దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు వేగంగా, సులభంగా సేవలను అందించే ఈ కార్యక్రమం భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. సాంకేతికతను ఉపయోగించి పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థంగా మార్చే దిశగా ఇది ఒక పెద్ద ముందడుగు అని పేర్కొంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..