Hyderabad : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)కు ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి నోటీసు జారీ చేశారు. 2024 నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైన నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని పిలిచారు. అయితే.. విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు పంపినా వర్మ వివిధ కారణాలు చూపుతూ హాజరు కాలేదు. తాజాగా పోలీసులు మరోసారి నోటీసు పంపారు. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు ఆయనకు వాట్సాప్ మెస్సేజ్ ద్వారా దానిని పంపారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. దీనిపై వర్మ రిప్లయ్ ఇస్తూ ఫిబ్రవరి 4న షూటింగ్ కారణంగా హాజరు కాలేనని, 7న విచారణకు వస్తానని తెలిపారు.
Ram Gopal Varma పై నమోదైన కేసు ఏమిటి?
వర్మ తన ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu), నారా లోకేష్ (Nara Lokesh)ల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో టీడీపీ (Telugu Desam Party) శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. వర్మపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేత రామలింగం మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నవంబర్ 19, 25 తేదీల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయినా వర్మ హాజరు కాలేదు. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో వర్మ ఇటీవల హైకోర్టు (High Court)ను ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు.
అప్పటి, ఇప్పటి నోటీసుల మధ్య తేడా ఏమిటంటే..
ఇప్పటికే పలుమార్లు పోలీసులు నోటీసులు పంపినా వర్మ (Ram Gopal Varma) విచారణకు హాజరు కాలేదు. ఈసారి ఆయన స్పందించారు. ఫిబ్రవరి 7న విచారణకు హాజరవుతానని తెలిపారు. ఇదిలా ఉండగా ఇంతకు ముందు ఇచ్చిన నోటీసులు అరెస్టు చేయడానికి ఉద్దేశించినవని కాబట్టి వర్మ హాజరు కాలేదని, ప్రస్తుతం వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో ఆయన విచారణకు హాజరవుతారని పోలీసులు ఆశిస్తున్నారు. అయితే.. వర్మ ఈసారైనా పోలీసుల ఎదుట హాజరవుతారా.. మరేదైనా కారణాలు చెబుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈసారి విచారణకు మాత్రమే పోలీసులు పిలుస్తున్నారు కాబట్టి కచ్చితంగా హాజరవుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..