హైదరాబాద్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం కల్పించింది. బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసు హైకోర్టులో ఇప్పటికే విచారణలో ఉందని, అదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతం పెంపుపై పిటిషనర్ వంగా గోపాల్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా, “హైకోర్టులో కేసు కొనసాగుతుండగా ఇక్కడకు ఎందుకు వచ్చారు?” అని ధర్మాసనం పిటిషనర్ తరఫు లాయర్‌ను ప్రశ్నించింది. దీనికి ప్రతిగా ఆయన “హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది” అని సమాధానమిచ్చారు. ఆపై ధర్మాసనం, “అక్కడ స్టే నిరాకరించినందుకు ఇక్కడ పిటిషన్ వేయాలా?” అంటూ వ్యాఖ్యానించింది. చివరగా, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటం వల్ల విచారణకు స్వీకరించలేమని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ తీర్పుతో బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట లభించించినట్లైంది..
సుప్రీం కోర్టు నిర్ణయంపై ప్రభుత్వం హర్షం
బీసీ రిజర్వేషన్లకు (BC Reservations) వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా ఆయనతో పాటు మంత్రులు పొన్నం, వాకిటి సుప్రీంకోర్టులోనే ఉన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడారు. అటు దిల్లీలోనే ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    