Bhu Bharathi Portal : రాష్ట్రంలో భూ భారతి చట్టాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించి ప్రజల నుంచి వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకొని అవసరమైతే మార్పులు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ponguleti srinivas reddy) ప్రకటించారు. ఈ చట్టాన్ని భూ యజమానులకు మరింత చేరువ చేస్తామన్నారు. ప్రజల మీద ఈ చట్టాన్నిబలవంతంగా రుద్దబోమని వారి సూచనల మేరకు ఆమోదయోగ్యంగా తీర్చిదిద్దుతామని అందుకే ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. భూ భారతి- 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
Bhu Bharathi Portal : జూన్ 2 నాటికి..
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ చట్టం చేసేముందు రైతుల కష్టం గురించి ఆలోచించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఆ కమిటీ సూచనలను పరిగణన లోకి తీసుకొని రైతులుకు శ్రీరామరక్షలా నిలిచే భూభారతి -2025 చట్టాన్ని (Bhu Bharathi ) రూపొందించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు మండలాల్లో తొలి విడత ప్రయోగాత్మకంగా అమలు చేసి అన్ని వివరాలు, దరఖాస్తులు సేకరిస్తామని తెలిపారు. జూన్ 2 నాటికి వీలైనన్ని సమస్యలు పరిష్కరించి , అర్హులైన వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను పట్టాలుగా అందజేస్తామని తెలిపారు.
భూయజమానులకు న్యాయం జరిగేలా తహశీల్దార్ మొదలు కొని సిసిఎల్ఎ వరకు ఐదంచెల వ్యవస్దను అందుబాటులోకి తెస్తున్నాం. సిసిఎల్ఎ వద్ద కూడా న్యాయం జరగలేదని భావిస్తే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా అవసరమైనన్ని ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా మీ ఫిర్యాదులను అవసరమైతే ఇంటినుంచి అధికారులకు పంపేలా పోర్టల్‌లో అవకాశం ఉంది. ఫిర్యాదులపై రెవెన్యూ శాఖ కార్యదర్శికి, మంత్రిగా నాకు కనిపించేలా పోర్టల్ (Bhu Bharathi Portal) ను రూపొందించామని మంత్రి పొంగులేటి తెలిపారు.
తప్పు చేసే అధికారులపై చర్యలు
రాష్ట్రంలో వచ్చేనెల 10వ తేదీకల్లా రెవెన్యూ , గ్రామపరిపాలనాధికారులు మీకు పూర్తిగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నాం. తప్పుచేసే అధికారులపై చర్యలకు వెనుకాడబోం. గతంలో రైతు బందు కోసం గులాబీ రంగు కార్యకర్తలకు భూమి లేకపోయినా పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. సక్రమంకాని అటువంటి అక్రమాలపై చర్యలు తప్పవు. రైతులకు మరిన్ని సేవలు అందేలా రెవెన్యూ వ్యవస్ద పనిచేయాలని ఏ పార్టీ కార్యకర్త అనే పక్షపాతం లేకుండా ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు చట్టం ఒక చుట్టంలా ఉపయోగపడేలా చూడాలని మంత్రి పొంగులేటి కోరారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.