Bill Clinton Hospitalised | అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు. వాషింగ్టన్ డీసీలోని మెడ్‌స్టార్ జార్జ్‌టౌన్ యూనివర్శిటీ హాస్పిటల్ (MedStar Georgetown University Hospital in Washington, D.C.)లో చేర్చారు. ఈ విషయాన్ని ఆయన డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆంజెల్ యురీనా వెల్లడించారు. ‘మాజీ అధ్యక్షుడు క్లింటన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఇప్పుడాయన బాగానే ఉన్నారు. క్రిస్మస్‌కు ముందే ఇంటికి తిరిగి వస్తారు’ అన్నారు. ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. వైద్య బృందం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు అవసరమైన చికిత్సను అందిస్తోందని పేర్కొన్నారు.
ఒక్కసారిగా కుప్పకూలిన Bill Clinton
వాషింగ్టన్‌లో తన నివాసంలో ఉన్నప్పుడు 78 ఏళ్ల క్లింటన్ (Former US President Bill Clinton) అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే ఆయన్ను వైద్యులకు చూయించారు. ప్రాథమిక వైద్యం అనంతరం ఆస్పత్రిలో చేర్చారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. వైద్య బృందం క్లింటన్‌కు మెరుగైన చికిత్స అందించడంలో నిమగ్నమైంది. ఆయన త్వరగానే కోలుకోని ఇంటికి తిరిగి వెళ్తారని వైద్యులు భరోసా ఇస్తున్నారు.
Bill Clintonకు అనారోగ్య సమస్యలు
అమెరికా 42వ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ 1993 నుంచి 2001 వరకు పరిపాలించారు. గతంలో పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. 2004లో ఆయనకు గుండెకు సంబంధిత క్వాడ్రపుల్ బైపాస్ సర్జరీ జరిగింది.
2005లో ఆయనకు ఊపిరితిత్తి శస్త్రచికిత్స జరిగింది. 2010లో క్లింటన్‌కు కొరోనరీ స్టెంట్లు అమర్చారు. 2021లో తీవ్రమైన రక్త సంబంధిత ఇన్ఫెక్షన్ కారణంగా లాస్ ఏంజిల్స్‌లో ఆరు రోజులపాటు ఆయన ఆస్పత్రిలో ఉన్నారు.
ప్రజాక్షేత్రంలో చురుగ్గా…
ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ క్లింటన్ తన ప్రజాక్షేత్రంలో చురుగ్గా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో చికాగోలో జరిగిన డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో ప్రసంగించారు. ఇలా ఆయన డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో ప్రసంగించడం ఇది 13వ సారి. తాజాగా తన స్వీయ రచనతో వెలువడిన పుస్తకం ‘Citizen: My Life After the White House’ ప్రచారం కోసం బిల్ క్లింటన్ అనేక ప్రదేశాల్లో పర్యటించారు. అధ్యక్షుడిగా తాను చేసిన సేవలు, ఆ పదవీ కాలం అనంతరం ప్రజాసేవలో చేసిన కృషి గురించి ఆయన ఆ పుస్తకంలో వివరించారు. ఆగస్టులో జరిగిన డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో ప్రసంగించిన సందర్భంగా క్లింటన్ భావోద్వేగంగా మాట్లాడారు. ప్రజా సేవ చేయడం తనకు లభించిన ఓ వరమని అన్నారు. ‘వైట్ హౌస్ (White House)ను వదిలి 23 ఏళ్లు గడిచినా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నా. ఈ అవకాశం కల్పిస్తున్న దేవుడికి కృతజ్ఞుడిని. ప్రజల కోసం పని చేయడం నాకు గొప్ప వరం’ అన్నారు.
ప్రజలకు క్లింటన్ మెస్సేజ్
ఆస్పత్రిలో ఉండగానే క్లింటన్ తనకు అందుతున్న వైద్య సేవల గురించి క్లింటన్ ప్రజలకు తెలియజేశారు. తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. తనపై ప్రజలకు ఉన్న శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు. క్లింటన్ కుటుంబ సభ్యులు , మద్దతుదారులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. క్లింటన్ త్వరగా కోలుకొని తన నిత్యజీవితంలోకి తిరిగి వస్తారని వైద్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయాల్లో విశేష గుర్తింపు
అమెరికా రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా క్లింటన్ పేరు పొందారు. ప్రపంచ వ్యాప్తంగా తన ప్రసంగాలు, కార్యకలాపాలతో విశేష గుర్తింపు పొందారు. దేశంలో ఆర్థిక పునరుద్ధరణ, సాంఘిక సంస్కరణల కోసం చేసిన కృషితో ఆయనకు ప్రతిష్ట ఏర్పడింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..