BRS Protest : ఆటో డ్రైవర్లకు గులాబీ దళం మద్దతుగా నిలిచింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా గళాన్ని మరింత పదును పెట్టింది. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలనలో ఆటో డ్రైవర్ల (Auto Drivers) కు అన్యాయం జరుగుతోందంటూ విమర్శిస్తూ వస్తున్న బీఆర్ఎస్.. తన నిరసనలను మరింత ఉధృతం చేసింది. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR) నేతృత్వంలో హైదరాబాద్ రోడ్లపై బుధవారం భారీ ప్రదర్శనను నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు ధరించే ఖాకీ చొక్కాలు వేసుకొని ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు ఈ ప్రదర్శన జరిగింది. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని బీఆర్ఎస్ విమర్శించింది. ఇప్పటికైనా హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసింది.
హామీలు విస్మరించిన కాంగ్రెస్ : కేటీఆర్
ర్యాలీ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, వాటిని నేటికీ నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్ర జనాభాలో సుమారు 8 లక్షల మంది ఉన్న ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కారు అన్యాయం చేస్తోందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు అనేక ప్రయోజనాలు కూర్చుతామని ఎన్నికల ముందు ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ తన మాటను నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బతుకు దుర్భరమై 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను గత అసెంబ్లీ సమావేశాల్లో మేం సమర్పించాం. అయినా
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆటో డ్రైవర్లు ఆందోళన చెందొద్దని కేటీఆర్ అన్నారు. వీరికి తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకొని కుటుంబాన్ని వీధిన పడేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఆటో డ్రైవర్ల హక్కుల కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని భరోసా ఇచ్చారు.
బీఆర్ఎస్ ప్రధాన డిమాండ్లు
- ఆటో డ్రైవర్లకు రూ. 12,000 ఆర్థిక సహాయం ప్యాకేజీని వెంటనే ప్రకటించాలి.
- ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆటోడ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి.
- మరణించిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు తక్షణ సహాయాన్ని అందజేయాలి.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                     
        
1 Comment
[…] రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) మెదక్ (Medak) పర్యటన సందర్భంగా […]