Canada’s Study visa rules : కెనడా ప్రభుత్వం (Canadian government) ఇటీవల విద్యార్థి వీసా విధానాల్లో చేసిన మార్పులు వేలాది భారతీయ విద్యార్థులను ఆందోళనలోకి నెట్టాయి. ముఖ్యంగా స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ (SDS) ప్రోగ్రామ్‌ను రద్దు చేయడం, అంతర్జాతీయ విద్యార్థులకు వీసా అనుమతులపై పరిమితిని విధించడం, ఆర్థిక నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలు భారత విద్యార్థుల (Indian students) భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి.
SDS ప్రోగ్రామ్ రద్దుతో ఇబ్బందులు
SDS ప్రోగ్రామ్ అంటే నిర్దిష్ట అర్హతలు ఉన్న విద్యార్థులు వేగంగా కెనడా స్టడీ వీసా పొందే విధానం. ఈ ప్రోగ్రామ్ రద్దయిన తర్వాత భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తులపై మరింత ఆలస్యం జరుగుతోంది. ఈ మార్పుల వల్ల విద్యార్థులకు అనేక సమస్యలు వస్తున్నాయని స్టడీ అబ్రాడ్ కన్సల్టెంట్లు తెలిపారు.
SDS ప్రోగ్రామ్ (Student Direct Stream (SDS) program) ద్వారా 20-30 రోజుల్లో వీసా మంజూరవుతుండేది. ఇప్పుడు సాధారణ ప్రక్రియలో 3-6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కొత్త నియమాల ప్రకారం విద్యార్థులు మరిన్ని ధృవపత్రాలను సమర్పించాల్సి వస్తోంది. గత సంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం భారతీయ విద్యార్థుల వీసా తిరస్కరణ రేటు 35-40% పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Study visa rules 2025 : వెంటనే పని దొరకదు
కెనడాలో ప్రస్తుతం 4,23,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఈ కొత్త మార్పుల కారణంగా వారు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. గతంలో విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే పని అనుమతి పొందే వీలుండేది. ప్రస్తుతం ఈ నియమాలను కఠినతరం చేయడం వల్ల అనేక మంది విద్యార్థులు కష్టాల్లో ఉన్నారు. కెనడాలో గృహ వాడ్రేలు (రెంటల్) ఖర్చులు గణనీయంగా పెరిగాయి. విద్యార్థులు తక్కువ అద్దె గదులు పొందడం కూడా చాలా కష్టంగా మారింది. కొన్ని విద్యార్థి సంఘాలు ఈ కొత్త మార్పులపై నిరసనలు చేపట్టాయి.
సంకోచిస్తున్న భారతీయ బ్యాంకులు
2025లో కెనడాలో చదవాలని భావిస్తున్న విద్యార్థులు కొత్త ఆర్థిక నిబంధనల వల్ల మరింత ఇబ్బంది పడుతున్నారు. కెనడా ప్రభుత్వం ప్రస్తుతం విద్యార్థులు గ్యారంటీడ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్టిఫికేట్ (GIC) కింద కనీసం C$20,635 (సుమారు ₹12 లక్షలు) బ్యాంకులో డిపాజిట్ చేయాలని తప్పనిసరి చేసింది. ఇదే క్రమంలో భారతదేశంలోని అనేక బ్యాంకులు ఇప్పుడు కెనడాలో చదవాలనే విద్యార్థులకు విద్యా రుణాలు మంజూరు చేయడంలో సంకోచిస్తున్నాయి.
ప్రత్యామ్నాయం వైపు చూపు
కెనడా తన విద్యార్థి వీసా (Study visa rules 2025) విధానాలను కఠినతరం చేయడం భారతీయ విద్యార్థుల కోసం పెద్ద సవాలుగా మారింది. SDS ప్రోగ్రామ్ రద్దు, వీసా ఆంక్షలు, ఆర్థిక పరిమితులు వంటి సమస్యలు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి. దీనితో అనేక మంది యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలను పరిశీలిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..