Cancer Vaccine : క్యాన్సర్ వ్యాక్సిన్ మార్కెట్‌లోకి త్వరలో రానుంది. రష్యా దీన్ని రూపొందించింది. కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఈ వ్యాక్సిన్‌ను లాంచ్ చేయనుంది. ఈ మేరకకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) సంకేతాలు ఇచ్చారు. తమ దేశం క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోందని, ఇది తుది దశకు చేరుకుందని ఆయన ప్రకటించారు.
ఆ తర్వాతే అంతర్జాతీయ మార్కెట్‌లోకి..
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఇది వేగంగా విస్తరిస్తోంది. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారిని కంట్రోల్ చేయడం తప్ప దీని బారి నుంచి బయట పడానికి కచ్చితమైన చికిత్స లేదు. అయితే.. ఈ విషయంలో రష్యా పురోగతిని సాధించింది. క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి ఆ వ్యాధిగ్రస్థులకు అందుబాటులోకి తెస్తోంది. ఈ వ్యాక్సిన్ రోగులకు చికిత్స అందించడానికే ఉపయోగపడుతుందని చెబుతోంది. రష్యా ఈ వ్యాక్సిన్‌ను ముందుగా తమ పౌరులకు అందించనున్నట్లు తెలిపింది. క్రమేణా అంతర్జాతీయ మార్కెట్‌లోకి తేనుంది.
Cancer Vaccine ఉచితమే…
రష్యా తమ సొంత mRNA క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. దీన్ని రోగులకు ఉచితంగా అందజేస్తుందని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఆండ్రే కాప్రిన్ చెప్పారు. రష్యా వార్తా సంస్థ TASS ప్రకారం ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ 2025 ప్రారంభంలో ప్రజలకు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. ఈ mRNA వ్యాక్సిన్ క్యాన్సర్ పెరుగుదల, వ్యాప్తిని నిరోధిస్తుందని తెలిపారు. గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ కూడా ఈ వ్యాక్సిన్ సామర్థ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.
2025 ఆరంభంలో మార్కెట్‌లోకి…
పుతిన్ ఈ ఏడాది ప్రారంభంలో క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రగతిపై సంకేతాలు ఇచ్చారు. కృత్రిమ మేధస్సు (AI) సాయంతో క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసి మార్కట్‌లోకి విడుదల చేయనున్నట్టు గింట్స్‌బర్గ్ తెలిపారు. 2025 ఆరంభంలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
మరిన్ని వివరాలపై అనిశ్చితి
క్యాన్సర్ వ్యాక్సిన్ పేరు ఏం ఉండబోతోంది.. ఇది ఏ రకాల క్యాన్సర్‌కు పనిచేస్తోందనేది ఇంకా స్పష్టం కావడం లేదు. అయినప్పటికీ ఈ పురోగతితో ఆంకాలజీ రంగంలో ప్రధానమైన అడుగు పడిందని అంటున్నారు నిపుణులు.
ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని ప్రయత్నాలు
ఇతర దేశాలు కూడా క్యాన్సర్ వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నమై ఉన్నాయి. యూకే ప్రభుత్వం, బయోఎన్‌టెక్ సంయుక్తంగా క్యాన్సర్ చికిత్సలు అభివృద్ధి చేయడానికి కలిసి పనిచేస్తున్నాయి. మోడెర్నా మరియు మెర్క్ అండ్ కో వంటి కంపెనీలు కూడా క్యాన్సర్ వ్యాక్సిన్లపై ప్రయోగాలు చేస్తున్నాయి. హ్యూమన్ పాపిలోమావైరస్ (HPV) కారణమైన సర్వికల్ క్యాన్సర్, హెపటైటిస్ B కారణమైన కాలేయ క్యాన్సర్ వ్యాక్సిన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని WHO పేర్కొంటోంది.
క్యాన్సర్ చికిత్సలో మైలురాయి
క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని రష్యా ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రకటన క్యాన్సర్ చికిత్సలో మైలురాయిగా నిలుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది విజయవంతమైతే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి ఊరట కలిగినట్టే అని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








