Car-ramming Attack : జర్మనీలోని మాగ్డెబర్గ్ నగరంలో కార్ ర్యామింగ్ దాడిలో ఐదుగురు మృతి చెందారు. 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఏడుగురు భారతీయులు ఉన్నారు. ఈ మేరకు నిన్న రాత్రి బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. శుక్రవారం సాయంత్రం సాక్సనీ-అనహాల్ట్ రాష్ట్రంలోని మాగ్డెబర్గ్ నగరం (Eastern German city of Magdeburg)లో 50 సంవత్సరాల వయసున్న వ్యక్తి తన కారును క్రిస్మస్ మార్కెట్ (Christmas market)లో జనసందోహంపై నడిపాడు. దీంతో ఐదుగురు మృతి చెందారని, వీరిలో తొమ్మిది సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడని, 200 మందికి పైగా గాయపడ్డారని జర్మన్ అధికారులు పేర్కొన్నారు.
భారతీయులకు సీరియస్
కార్ ర్యామింగ్ దాడిలో ఏడుగురు భారతీయులు గాయపడగా వారిని ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో ముగ్గురు డిశ్చార్జ్ కాగా మరో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) భయంకర దాడిగా పేర్కొంటూ ఖండించింది. గాయపడిన వారిలో ఏడుగురు భారతీయులు ఉన్నారని వెల్లడైనా ఇంకెంత మంది ఉంటారో స్పష్టంగా చెప్పలేమని MEA తెలిపింది. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై అలర్ట్‌గానే ఉన్నామని, ఎప్పటికప్పుడు ఆస్పత్రి వర్గాలతో సంప్రదిస్తూనే ఉన్నామని పేర్కొంది. గాయపడిన భారతీయులకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పింది. ఈ జరిగిన దాడిని భయంకరమైనదిగా భావిస్తున్నామని, క్షతగాత్రుల్లో భారతీయులు ఉండటం దిగ్భ్రాంతిని కలిగించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Car-ramming Attack అంటే..?
కార్ ర్యామింగ్ అనేది ఒక కారును లేక ఇతర వాహనాన్ని ఉపయోగించి ప్రజలను గాయపరచడం లేదా హతమార్చడం లక్ష్యంగా చేసే దాడి. ప్రజలు గుమిగూడే ప్రదేశాలు, వీధుల్లో లేదా పండుగల సమయంలో ఉద్దేశపూర్వకంగా దీనికి పాల్పడతారు. ఈ విధమైన దాడులను సాధారణంగా ఉగ్రవాద లేదా వ్యక్తిగత ప్రతీకార చర్యలుగా పరిగణిస్తారు. కారు ర్యామింగ్ దాడుల కారణంగా ప్రాణనష్టం సంభవించొచ్చు. గాయాలు కావచ్చు. ఆస్తి నష్టం కూడా సంభవించొచ్చు. ఈ దాడులు ఆకస్మాత్తుగా జరగడం వల్ల బాధితులకు తక్షణమే జాగ్రత్త పడే అవకాశం ఉండదు.
విపరీత మనస్తత్వం గల వ్యాక్తులు చేసే దాడి
కార్ ర్యామింగ్‌ను చాలా సందర్భాల్లో ఉగ్రవాదులు లేదా విపరీత మనస్తత్వం వ్యక్తులు చేస్తారు. విదేశాల్లో ఈ దారుణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఈ దాడులు తీవ్రత పెరగడంతో ప్రజల భద్రత కోసం ప్రభుత్వాలు, భద్రతా సంస్థలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ దాడులను నిరోధించడానికి భారీ జనసందోహ ప్రాంతాల్లో కాంక్రీట్ బారికేడ్లు లేదా వాహన రోధక పరికరాలను ఏర్పాటు చేస్తున్నాయి.
ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే..
కారు ర్యామింగ్ వంటి చర్యలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించడం, ప్రజలకు మరింత రక్షణ కల్పించడం లాంటి చర్యలు చేపట్టాలనే డిమాండ్ వస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..