Caribbean Earthquake : కరేబియన్ సముద్రంలో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. 7.6 తీవ్రతతో అలలను కుదిపేసింది. ఈ మేరకు అమెరికా భూకంప పరిశీలన సంస్థలు (USGS) పేర్కొన్నాయి. ఈ భూకంపం శనివారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) భూమి ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల (6.21 మైళ్ల) లోతులో సంభవించింది. దీని కేంద్రబిందువు హోండురాస్‌కు ఉత్తరాన 209 కిలోమీటర్ల దూరంలో, కేమాన్ దీవుల సమీపంలో గుర్తించబడింది.
Caribbean Earthquake:..సునామీ వచ్చే అవకాశం
ఈ భూకంపం కారణంగా మొదట అమెరికా (US) సునామీ హెచ్చరిక వ్యవస్థ కరేబియన్ సముద్రం, హోండురాస్ ఉత్తర ప్రాంతాలకు సునామీ హెచ్చరికను జారీ చేసింది. అయితే, అమెరికా అట్లాంటిక్ తీరం లేదా గల్ఫ్ కోస్ట్‌కు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొంది. కానీ, అప్రమత్తంగా ఉండాలని ప్యూర్టో రికో, వర్జిన్ ఐలాండ్స్ వంటి ప్రాంతాలకు సూచనలు ఇచ్చింది.
సునామీ అలల ప్రభావం
పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకారం, భూకంప కేంద్రం చుట్టుపక్కల 620 మైళ్ల పరిధిలోని తీరం ప్రాంతాలకు ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా కేమాన్ ఐలాండ్స్, జమైకా, క్యూబా, మెక్సికో, హోండురాస్, నికరాగువా, బహామాస్, కొస్టా రికా, బెలీజ్, హైటీ, పానామా, గ్వాటెమాలా వంటి దేశాలపై ప్రభావం ఉండొచ్చని హెచ్చరించారు. క్యూబా తీరంలో 1 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశముందని అమెరికా జాతీయ మహాసముద్రం, వాతావరణ సంస్థ (NOAA)
అంచనా వేసింది. అలాగే, హోండురాస్, కేమాన్ ఐలాండ్స్ తీరప్రాంతాల్లో 0.3 నుంచి 1 మీటరు ఎత్తు వరకు అలలు సంభవించే అవకాశం ఉందని ప్రకటించింది.
పలు హెచ్చరికల ఉపసంహరణ
భూకంపం తరువాత 12 దేశాలకు పైగా సునామీ హెచ్చరికలు జారీ చేసిన అమెరికా సంస్థలు కొన్ని గంటల తర్వాత వాటిలో చాలా వరకు ఉపసంహరించుకున్నాయి. అయితే, కొన్నిచోట్ల చిన్న స్థాయిలో సముద్రపు నీటి మట్టం మారే అవకాశం ఉందని తెలిపాయి.
ప్రజలకు సూచనలు
భూకంపం ప్రభావిత ప్రాంతాలైన హోండురాస్, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్, ప్యూర్టో రికో, కేమాన్ ఐలాండ్స్ ప్రభుత్వాలు తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా కేమాన్ ఐలాండ్స్ ప్రభుత్వం తీర ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేస్తూ ముందస్తు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
ఎలాంటి నష్టం లేదంటున్న అధికారులు
ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద నష్టం జరగలేదని, మరణాలు లేదా గాయాలు సంభవించలేదని ప్రాథమిక నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే, భూకంపం తర్వాత అల్పస్థాయిలో భూమి కంపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..