- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు
- న్యూదిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ పోరుగర్జన
BC Reservations | తెలంగాణలో కుల గణన చేపట్టొద్దంటూ తీవ్ర ఒత్తిడి వచ్చినా, తాము దానికి తలొగ్గకుండా ఆ పని పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల (BC Reservations) సాధన కోసం బీసీ సంఘాలు నిర్వహించిన మహా ధర్నా (BC Poru Garjana) లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “బీసీల హక్కులు కాపాడే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. న్యాయం చేయడంలో వెనుకడుగు వేయదనిఅని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే కుల గణన చేపట్టామని, బీసీలకు రిజర్వేషన్ల పెంపు తీర్మానం చేశామని తెలిపారు. చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలన్నా.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కొనసాగాలన్నా జనగణనలో కుల గణన జరగాలన్నారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా జన గణనలో కుల గణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకుంది. జన గణనలో కుల గణన చేర్చి దాని ఆధారంగా విద్యా, ఉద్యోగ, ఉపాధిలో మాత్రమే కాకుండా రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించారు రాహుల్ గాంధీ మాటను నిలబెట్టాల్సిన బాధత్య ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉంది. నాది ఏ సామాజికవర్గమైనా…రాహుల్ గాంధీ మాట నిలబెట్టేందుకు ప్రయత్నించానని తెలిపారు.
మేం అధికారం చేపట్టిన వంద రోజులు తిరగకముందే బలహీన వర్గాల లెక్కలు తేల్చేందుకు శాసనసభలో తీర్మానం చేశాం. మా పాలన ఏడాది తిరగక ముందే కులగణన పూర్తి చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఫిబ్రవరి 4న చట్టసభల్లో బిల్లులు పెట్టాం. అందుకే ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డే గా ప్రకటించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రిజర్వేషన్లు పెంచాలనేది బలహీన వర్గాల కోరిక..
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయమని గల్లీ నుంచి దిల్లీ వరకు యువత పోరాడారని, నాటి దుర్మార్గ పాలకుడు యువత గోసను పట్టించుకోలేదని ఎంత కొట్లాడినా.. ఎందరు మరణించినా నాటి పాలకుల చెవులకు ఎక్కలేదని సీఎం రేవంత్ మండిపడ్డారు. పాదయాత్ర సమయంలో తండ్రీకొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టమని నేను చెప్పాను.. యువత ఆ పని చేశారు. మా ప్రభుత్వం వొచ్చిన సంవత్సరంలోపే 59 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి చిత్తశుద్ధిని చాటుకున్నాం. రిజర్వేషన్లు పెంచాలనే బలహీన వర్గాల కోరిక.. ధర్మబద్దమైన కోరిక.. ధర్మబద్దమైన కోరిక నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం ముందుకురావాలన్నారు.
BC Reservations : బీసీ రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం
బీసీల రిజర్వేషన్ల పెంపునకు వాళ్లు (బీజేపీ నేతలు) విధానపరంగా వ్యతిరేకం. మొరార్జీ దేశాయ్ మండల్ కమిషన్ నియమిస్తే.. వీపీ సింగ్ మండల్ కమిషన్ దుమ్ము దులిపితే ముందుకు తెచ్చారు. మండల్ కమిషన్‌పై బీజేపీ కుట్ర చేసి కమండల్ యాత్ర మొదలుపెట్టింది. ఆ కమండల్ యాత్ర ప్రతినిధే నరేంద్ర మోదీ… ఇందిరాగాంధీ దళిత, ఆదివాసీ వర్గాలకు చెందిన వారు కాదు… కానీ వారికి అమ్మలా వ్యవహరించి.. రిజర్వేషన్లు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది. భూస్వాముల దగ్గర ఉన్న వేల ఎకరాలు గుంజుకొని ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చింది. దళితులు, ఆదివాసీలు ఇళ్లలో ఆమె ఫొటోలు ఇప్పటికి ఉన్నాయి. బలహీన వర్గాలను బలోపేతం చేయడానికి బీజేపీ వ్యతిరేకం. బలహీన వర్గాల లెక్కలు తేల్చాల్చి వొస్తుందనే 2021లో చేయాల్సిన జనాభా లెక్కలను బీజేపీ చేయలేదు. రాహుల్ గాంధీ కుల గణన చేయాలని డిమాండ్ చేయడంతో 2025 వచ్చినా జన గణన చేయకుండా వాయిదా వేస్తున్నారు.
అలా చేస్తే.. మోదీని ఘనంగా సన్మానిస్తాం.. !
బలహీన వర్గాలకు రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఇచ్చిన మాట తెలంగాణలో నిలబెట్టుకున్నాం. దామాషా ప్రకారం నిధులు, నియామకాలు ఉండాల్సిందే. అందుకే కులగణన (Caste census) చేపట్టి బీసీల లెక్క తేల్చాం. రిజర్వేషన్లు పెంచడం కేంద్రం పరిధిలోని అంశం. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచేందుకు మోదీకి ఎందుకు ఇబ్బంది. కుల గణన చేపట్టి రిజర్వేషన్ల పెంపు తీర్మానం చేసి దేశానికే తెలంగాణ ఓ దిక్సూచిగా నిలిచింది. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ కులగణన చేపట్టలేదు. మా రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచుకుంటామని మేం కోరాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరడం లేదు. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తే 10 లక్షల మందితో సభ పెట్టి మోదీని సన్మానిస్తామన్నారు. రిజర్వేషన్ల పెంపు కోరుతూ ఈ అంశంపై ఢిల్లీలో ధర్నా చేపట్టాల్సి వచ్చింది. బండి సంజయ్ బీసీల కోసం ప్రాణం ఇస్తామంటున్నారు.. ఆయన ప్రాణం మాకు వద్దు.. వందేళ్లు ఆయన జీవించాలి.. మాకు రిజర్వేషన్లు పెంచితే చాలు. కురుక్షేత్రానికి ముందు అయిననూ పోయి రావలి హస్తినకు అన్నారు.. ఇప్పుడు మేం ధర్మం కోసం హస్తినకు వచ్చాం. న్యాయమైన బీసీ రిజర్వేషన్ల కోసం దిల్లీ వచ్చాం.. ఇకపై దిల్లీకి రాము… రిజర్వేషన్ల (BC Reservations) పెంపునకు బలహీన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించాలని.. మోదీ బీసీ రిజర్వేషన్లు ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగురవేస్తామని రిజర్వేషన్లు సాధిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








