Amit Shah : రాజ్యాంగంపై రాజ్యసభలో కాంగ్రెస్, బీజేపీ మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర వివాదానికి దారి తీసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తన ప్రసంగంలో అంబేద్కర్ (Ambedkar)పై చేసిన వ్యఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్, దాని సహచర పార్టీల ఎంపీలు తప్పుపట్టారు. రాజ్యాంగ నిర్మాతపై అమిత్‌షా అనుచితంగా మాట్లాడారని, దీన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఈ వ్యాఖ్యలు అంబేద్కర్‌ను అవమానించడమేనని కాంగ్రెసు ఆరోపించింది. దీనిపై ఆయన క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే..
రాజ్యాంగంపై రాజ్యసభ (Rajya sabha) లో చర్చ వాడీవేడిగా సాగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం సేషన్‌లో కాంగ్రెస్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పలు ఆరోపణలు చేశారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఒక కుటుంబ ప్రైవేట్ ఆస్తిగా భావించి, పార్లమెంట్‌ను మోసం చేస్తోందని వ్యాఖ్యానించారు. ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడానికి 50 శాతం కోటా పరిమితిని అతిక్రమించాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ తీసుకొచ్చిందని, అన్ని రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తుందని తెలిపారు.
అంబేద్కర్ పేరు ఉచ్ఛరించడం ఫ్యాషన్
రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న క్రమంలోనే అమిత్‌షా ప్రతిపక్ష ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అని ఆ పేరును ఉచ్ఛరించడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. ఇన్నిసార్లు దేవుడి పేరును స్మరించినా ఏడు జన్మలపాటు స్వార్గాన్ని పొందే వారు అని ప్రతిపక్షాలపై వ్యగ్రస్థ్రాలను సంధించారు. దీంతో సభలో ఒక్కసారిగా ప్రతిపక్ష ఎంపీలు హోరెత్తించారు. రాజ్యాంగ నిర్మాత పట్ల అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు ఖండనీయమని ఆరోపించారు. ఈ అంశంపై రెండు రోజులుగా పార్లమెంటు వెలుపల, బయట ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నారు. అంబేద్కర్‌ను అవమానించిన అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమిత్‌షా చేసిన ప్రసంగం వీడియో క్లిప్‌ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Amit Shah ను తప్పు పట్టిన కాంగ్రెస్
రాజ్యంగంపై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పు పట్టింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులకు అంబేద్కర్ పట్ల అసహనం ఎక్కువగా ఉందని అమిత్‌షా వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయని ఆరోపించింది.
మనుస్మృతి నమ్మేవారు ఎప్పుడూ అంబేద్కర్‌ను విభేదిస్తారని రాహుల్ గాంధీ విమర్శించారు.
పార్లమెంట్ ప్రాంగణంలోకాంగ్రెసు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్‌ను అవమానించినందుకు హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా ఈ వ్యాఖ్యలపై ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలన్నారు.
కాంగ్రెసు ఎంపీ నీరజ్ దాంగి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ అంబేద్కర్ పేరు ప్రస్తావించడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిందని అమిత్ షా రాజ్యసభలో వ్యాఖ్యానించడం ఖండనీయమన్నారు. అంబేద్కర్‌ను, దేశంలోని దళితులను అమిత్‌షా అవమానించారని విమర్శించారు. అంబేద్కర్ పట్ల బీజేపీకి ఉన్న అక్కసు ఏపాటిదో దీని ద్వారా వెల్లడైందని వ్యాఖ్యానించారు. అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన రాజ్యాంగ పదవిని నిర్వహించే హక్కును కోల్పోయారని దాంగి అన్నారు. ఆయన హోం మంత్రి పదవి నుంచి వెంటనే వైదొలగాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..