4 రిజిస్ట్రేషన్ లకు నాలుగు లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు..?
విచారణ చేస్తే సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ ఖాయమేనంటున్న స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు..
ఆ సబ్ రిజిస్ట్రార్ మామూలోడు కాదట, ఎప్పుడు వచ్చామన్నది కాదు..ఎంత కొల్లగొట్టామన్నది ముఖ్యం.. అనే స్థాయిలో సారు ఆలోచనలు ఉంటున్నట్లు కార్యాలయంలో క్రింది స్థాయి ఉద్యోగులు కోడైకూస్తున్నారు. ప్రస్తుత పోస్టింగ్ తో “ఆనందం”లో ఉన్న సారు రిజిస్ట్రేషన్ ల పేరుతో అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. సాధారణ బదిలీల్లో భాగంగా సదరు కార్యాలయానికి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా వచ్చిన అధికారి వచ్చిరాగనే తన చేతివాటాన్ని ప్రదర్శించడంతో ఆ కార్యాలయంలోని ఉద్యోగులతోపాటు బ్రోకర్ లు సైతం కంగుతిన్నట్లు తెలుస్తోంది.తను ఊహించినదానికంటే భిన్నంగా కాసులు కురిపించే కార్యాలయంలో పోస్టింగ్ రావడంతో సారు “ఆనందా”నికి అవధులు లేనట్లు ప్రచారం జరగడం గమనార్హం.
నాలుగు రిజిస్ట్రేషన్ లకు నాలుగు లక్షలా..?
నాలుగు రిజిస్ట్రేషన్ లకు నాలుగు లక్షలేంటీ? అని అనుకుంటున్నారా? అవునండి ఇప్పుడు ఆ కార్యాలయంలో అదే ప్రచారం జరుగుతోంది.నిబంధనలకు విరుద్ధంగా ఓ నాలుగు రిజిస్ట్రేషన్ లు చేసినందుకు సదరు సబ్ రిజిస్ట్రార్ కు అక్షరాల నాలుగు లక్షల రూపాయలు ముడుపుల రూపంలో ముట్టినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని ఎల్లాపూర్ అంగడిగా పిలువబడే అనుమతిలేని వెంచర్ లోని నాలుగు ప్లాట్లను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసినందుకు గాను సారుకు ఒక్కో డాక్యుమెంట్ కు గరిష్టంగా లక్ష రూపాయల వరకు రియల్టర్ ముట్టజెప్పినట్లు ఆర్వో కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిబంధనలు అతిక్రమించి సదరు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ లు చేశాడంటే ప్రచారం జరుగుతున్నదాంట్లో వాస్తవం లేకపోలేదని కార్యాలయంలో ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు.
సస్పెండ్ చేస్తారా..?
నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్ లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినందుకు గాను ఇటీవలి కాలంలో వరంగల్ ఆర్వో పరిధిలోని ఖిలా వరంగల్ ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ రాజేష్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అదేవిధంగా అక్రమ వెంచర్ లోని ప్లాట్లను జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న సదరు అధికారి హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని ఎల్లాపూర్ లో అక్రమ వెంచర్(పాత అంగడి)లోని నాలుగు ప్లాట్లు నిబంధనలను తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్ చేసినందుకు సస్పెండ్ చేస్తారా..? లేదా..?మరి ఈ విషయంలో జిల్లా రిజిస్ట్రార్ ఏవిధంగా స్పందిస్తారో చూడాల్సిందే.
1 Comment
[…] […]